e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home Top Slides ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ అండ

ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ అండ

ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ అండ
  • నెలకు 30 కోట్ల వరకు ఖర్చు బియ్యం సరఫరాకు అదనం
  • స్కూళ్లు తెరిచేదాకా నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం
  • ఆపత్కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ నిర్ణయం
  • ఈ నెల నుంచే అమలు.. వెంటనే విధి విధానాలు ఖరారు
  • రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం
  • నేడు జిల్లా అధికారులతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌
  • టీచర్లు ఖాతా, వివరాలతో కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి
  • ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లు, ప్రజాప్రతినిధుల హర్షం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (నమస్తే తెలంగాణ): కరోనా దెబ్బకు కకావికలమైన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచింది. జీతాల్లేక తిండికి సైతం తన్లాడుతున్న వారిని అదుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ వారికి నెలకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీచేయాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఈ నెల నుంచే సహాయాన్ని అందించడంతోపాటు.. మళ్లీ పాఠశాలలు తెరిచేంత వరకూ కొనసాగించాలని స్పష్టంచేశారు. ఆపదలో ఉన్నవారి కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. అర్హులైనవారు బ్యాంక్‌ ఖాతా, ఇతర వివరాలతో వారివారి జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారుచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం నిర్ణయంతో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్ల్లోని సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్ధి చేకూరనున్నది. రూ.2వేల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం సుమారు 30 కోట్లు వెచ్చించనున్నది. ఇదికాక బియ్యం పంపిణీ ఖర్చు ప్రభుత్వానికి అదనం.

మూతపడ్డ బడులు.. రోడ్డున పడ్డ బతుకులు

రాష్ట్రంలో 10,491 ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. యూడైస్‌ సమాచారం ప్రకారం వీటిలో 1.28 లక్షల మంది టీచర్లు, మరో 17 వేల మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నిరంగాల మాదిరిగానే ప్రైవేటు విద్యాసంస్థలు కూడా కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది బతుకులు తలకిందులైపోయాయి. విద్యాసంస్థలు మూతపడటంతో.. వారంతా రోడ్డున పడ్డారు. ఫీజులు వసూలు కాకపోవడంతో యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోగా, చాలామందిని ఉద్యోగాల నుంచి తొలిగించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూళ్లు తిరిగి ప్రారంభించినా మళ్లీ కరోనా కరాళనృత్యం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ప్రైవేట టీచర్ల పరిస్థితి అయోమయంలో పడింది.

మార్గదర్శకాల తయారీలో విద్యాశాఖ

యూడైస్‌ డాటాలో నిక్షిప్తమైన టీచర్లు, పైగా 2020 మార్చి వరకు పనిచేసిన టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం చొప్పున ఇచ్చేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సమావేశంలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు.

సీఎం నిర్ణయంపై హర్షం

ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రైవేట్‌ టీచర్లు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు కృషిచేసిన మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయంపై టీఆర్‌ఎస్వీ నేత కిశోర్‌గౌడ్‌, తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తంచేశారు.

మానవత్వమున్న మహా మనిషి


కరోనాతో ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చాలామంది ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మమ్మల్ని ఆదుకోవడానికి కేసీఆర్‌ ముందుకురావడం హర్షణీయం. మానవత్వమున్న మహా మనిషినని కేసీఆర్‌ మరోమారు నిరూపించుకొన్నారు.

షేక్‌ షబ్బీర్‌ అలీ, ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం అధ్యక్షుడు

ముఖ్యమంత్రిది మానవీయ నిర్ణయం

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బందుల్ని పెద్దమనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ నిర్ణయం తీసుకొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
-డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

రెండు లక్షల మందికి లబ్ధి

మానవీయకోణంలో అలోచించి ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని, ఉపాధ్యాయులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయంతో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.

యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

ప్రైవేట్‌ టీచర్లకు చాక్‌పీస్‌ పట్టుకోవడం, పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే తెలుసు. స్కూల్‌ నడిస్తేనే పని. స్కూల్‌ లేదంటే పస్తులుండాల్సిందే. కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు టీచర్లువ్యవసాయ, అడ్డాకూలీలుగా మారారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకొన్న సీఎం కేసీఆర్‌కు
రుణపడి ఉంటాం.

పీ బడేసాబ్‌, ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఉపశమనం

వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు సీఎం కేసీఆర్‌ మాకు సహాయం ప్రకటించడం సంతోషం. బియ్యం, డబ్బులు కలుపుకొంటే ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల వరకు సాయంగా అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మమ్మల్ని గుర్తించి పట్టించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది.
-వేములవాడ విద్యాసాగర్‌, ప్రైవేటు ఉపాధ్యాయుడు, కరీంనగర్‌

Advertisement
ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ అండ

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement