హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ(Yogada Satsang Society) వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తిరుపతి నలందా నగర్లో నూతన ధ్యాన కేంద్రాన్ని వైఎస్ ఎస్ స్వామి స్మరణానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువని చెప్పారు. భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని, సాధన అంటే దయ, క్షమ, సేవా తత్పరత అలవరచుకోవడమేనన్నారు. హైదరాబాద్ మధురానగర్లోని సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్ లో వైఎస్ ఎస్ భక్తులు క్రియాయోగ ధ్యానం, భజనలు, పుష్పాంజలి నిర్వహించారు.
పరమహంస యోగానంద పశ్చిమ దేశాలలో, భగవంతునిపై భక్తి, క్రమబద్ధమైన ధ్యానం అన్ని నిజమైన మతాల ఐక్యతను నొక్కిచెబుతూ, అవిశ్రాంతంగా బోధించారు,. కేవలం విశ్వసించడమే కాకుండా, భగవంతుడిని నేరుగా అనుభూతి చెందమని ఆయన సాధకులను ప్రోత్సహించారు. ఆయన ఆధ్యాత్మిక మహాగ్రంథం, ఒక యోగి ఆత్మకథ, లక్షలాది హృదయాలను స్పృశించి, ఆత్మలను ఈశ్వర సాక్షాత్కార మార్గం వైపునకు నిరంతరం ఆకర్షిస్తూ ఉంది. ఆయన రచనలు ప్రాచ్య, పాశ్చాత్య ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒకేలా ఉన్న సార్వత్రిక సత్యాలను మరింతగా వెల్లడిస్తాయి.
యోగానంద జయంతి సందర్భంగా, దివ్యమైన ఆయన మార్గదర్శనాన్ని కోరుకునే శ్రద్ధగల సాధకులు యోగానంద సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూనే ఉన్నారు. శాశ్వత ఆనందం కోసమైన అన్వేషణ—భక్తి, క్రమశిక్షణ, దైవ కృప ద్వారా—భగవంతుని యందే నెరవేరుతుందని ఆయన మనకు హామీ ఇస్తున్నారు.