యాదగిరిగుట్ట, మే 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దుబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు స్వామివారి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు తెలిపారు. 9న జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 10వ తేదీన నిత్యమూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్థన అలంకార సేవ, హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకార సేవ, 11న ప్రధానాలయంలో మూలమస్తృహవనం, సహస్ర ఘటాభిషేకం, నృసింహ జయంతి, తీర్థప్రసాద గోష్టి నిర్వహించనున్నామని పేర్కొన్నారు.