Lok Sabha Elections | హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలించారు. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్ 54, కరీంనగర్ 53, వరంగల్ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్ 42, నిజామాబాద్ 42, జహీరాబాద్ 40, నాగర్ కర్నూల్ 34, మహబూబాబాద్ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.