Daruvu Yellanna | ఇంతకాలం బీఆర్ఎస్ను విమర్శించిన దరువు ఎల్లన్న.. ఇప్పుడు అదే పార్టీలో చేరారు. కారణం?
ఆ సమయంలో నేను ఉన్న పార్టీల ఒత్తిడి వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఇంటి నుంచి తప్పిపోయి ఇప్పుడు మళ్లీ సొంతింటికి వచ్చానన్న ఫీలింగ్‌లో ఉన్నా. రాజకీయ పార్టీలో చేరానన్న భావన నాలో లేదు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మీ స్పందన?
విద్యార్థులను ఇప్పుడే కాదు.. ఉద్యమ కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నది. ‘తార్నాకలో బీర్లు తాగి లొల్లి చేస్తరు’ అన్న రేవంత్ మాటలు ఆయన అహంకారాన్ని నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ విద్యార్థులను నాయకులుగా గుర్తించవు. ఈ రెండు పార్టీలూ ప్రజలను ముంచేవే!
విద్యార్థి ఉద్యమ నేతగా మీకు బీజేపీలో సముచిత స్థానం దక్కలేదని భావించారా?
ఒక బీజేపీలో మాత్రమే కాదు, కాంగ్రెస్‌లో కూడా విద్యార్థి నేతలు, ఉద్యమకారులకు సముచిత స్థానం మాట దేవుడెరుగు.. కనీస గౌరవం ఉండదు. వాళ్లకు ఎంతసేపు కోట్లు, సూట్‌కేసులు ఇచ్చేవాళ్లే కనిపిస్తారు. అదే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఆయనతో సమానంగా మాకు వేదిక అందించారు. వాళ్లు కనీసం కష్టపడి పనిచేసిన విద్యార్థి నాయకుల పేర్లు కూడా ప్రస్తావించరు.
దళితులకు ఏమీ చేయని బీజేపీ.. దళితబంధు పథకం తెచ్చిన బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల గురించి ఏం చెబుతారు?
బీజేపీ దళిత వ్యతిరేకి. మతతత్వ పార్టీ. దళితుల ఓట్ల కోసం మాటలు చెప్పడం తప్ప ఇప్పటి వరకు దళితులకు చేసిందేమీ లేదు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచించి దళితబంధులాంటి మహోన్నత పథకం తెచ్చిన బీఆర్ఎస్, కేసీఆర్ గురించి రెండు మూడు మాటల్లో చెప్పలేం.సంక్షేమం అంటే బీఆర్ఎస్ మాత్రమే.
ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణ గురించి మీ నుంచి పాట ఎప్పుడు వస్తుంది?
‘వీరులారా వందనం’ పాట ఖండాంతరాలు దాటి.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, అమరవీరుల ఖ్యాతిని చాటింది. ‘ఏమయి పోతున్నదో తెలంగాణ.. ఎటుగాని తీరాయెనో’ అని ఆగమైన తెలంగాణ ఆవేదన గురించి రాశాను. ప్రగతి తెలంగాణ గురించి త్వరలో రాస్తా.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి దరువు ఎల్లన్న కామెంట్?
సంక్షేమ పథకాలకు రోల్ మాడల్ తెలంగాణ. మా నాయకులు కేసీఆర్, కేటీఆర్ చెప్పిన మాటే నాది కూడా. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.
మీతోటి విద్యార్థి నేతలు, కవులు, కళాకారులకు మీరిచ్చే పిలుపు?
అందరికీ నా విన్నపం ఒకటే! కాంగ్రెస్, బీజేపీలను నమ్మకండి. మనల్ని, మన ఆవేశాన్ని వాళ్ల అధికారం కోసం వాడుకుంటాయి. ఒకప్పుడు తెలంగాణ సాధించుకోవడానికి మనమంతా ఏకమయ్యాం. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల్లో చికకుండా తెలంగాణను కాపాడుకోవడానికి మరోసారి ఏకమవుదాం.