బొడ్రాయిబజార్, జూన్ 16 : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి వ్యతిరేక అభ్యర్థిని పెట్టడం కోసం దేశ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ అభ్యర్థిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలో నిర్వహించిన ఆ పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని సూచించారు. పార్టీల మధ్య ఉన్న సమస్యలను సాకుగా తీసుకొని బీజేపీకి లాభం చేకూర్చేలా ఉండొద్దన్నారు.