Alisagar | నవీపేట, మార్చి 9: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అలీసాగర్ ఆయకట్టుకు సాగునీరందక పొట్టదశలో ఎండుతున్న పంటపొలాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనానికి నీటిపారుదల శాఖ జిల్లా స్పందించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఎస్ఈ బద్రీనారాయణ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఈఈ బాల్‌రాం అధ్వర్యంలో ఏఈ ప్రణయ్‌రెడ్డి అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు.
నారాయణపూర్‌లో ఎండుతున్న పంటలకు డీ/50/4 కాలువ ద్వారా సాగునీటిని తరలించారు. నారాయణపూర్ గ్రామ రైతులు సొంత ఖర్చులతో కాలువ పూడికతీత పనులు చేయించుకున్నారు. కాలువ ద్వారా ఈ నెల 30 వరకు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఏఈ ప్రణయ్‌రెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తమ సమస్యలను వెలుగులోకి తెచ్చి, నీటి విడుదలకు చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ’కు నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు సాగర్, సత్తార్, ప్రభాకర్, రమణారావు, భూమయ్య, ఇతర ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.