హనుమకొండ చౌరస్తా, మే 30: చరిత్రపై అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర రాజముద్రను మార్చే పిచ్చి ఆలోచన మానుకోవాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హితవుపలికారు. జనామోదంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన కాకతీయ తోరణం, చార్మినార్ లోగోను రాజముద్ర నుంచి తొలగిస్తామంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గురువారం హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో టార్చ్ (టీం ఆఫ్ రిసెర్చ్ కల్చర్ అండ్ హెరిటేజ్) ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మా ట్లాడారు. సంస్కృతికి చిహ్నం కాకతీయుల కళాతోరణమని, రాజముద్రలో తోరణాలను తొలిస్తే అందరూ ముక్తకంఠంతో ఖండించాలని కేయూ హిస్టరీ ప్రొఫెసర్ విజయబాబు పిలుపునిచ్చారు. సదస్సులో ప్రేరణి అశోక్, అభిషేక్, అస్నాల శ్రీనివాస్, పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.