హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం దళితబంధు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం శాసనసభలో దళితబంధుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. దళితుల్లో ఒక్కరోజు కూలికి పోకున్నా ఉపవాసముండే కుటుంబాల వేదన గుర్తెరిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ విశ్వం ఉన్నంతవరకు దళితులు ఆయన్ను గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతకంటే మంచి పథకం అమలుచేస్తే చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గాలో దళితబంధు కావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్ కిట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు రాజీనామా చేస్తే వచ్చాయా? అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. చినిగిపోయిన విస్తరాకులు కుట్టడానికే తమకు ఇంతకాలం పట్టిందనిఅన్నారు. ఓట్లకోసమే ఈ పథకం అంటునోళ్లు వారిపార్టీల పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు.