హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్నూరుకాపుల్లో చైతన్యం తేవాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన 20 రోజులపాటు చేపట్టే పాదయాత్ర పోస్టర్ను గురువారం హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మున్నూరుకాపులు అన్నిరంగాల్లో ఎదుగాలని కోరారు. సేన ఆధ్వర్యంలో మున్నూరుకాపుల చైతన్యం కోసం ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 6 వరకు చేపట్టే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మహబూబ్నగర్ కాటన్ మిల్లు సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి మొదలయ్యే యాత్ర, హన్మకొండలో ముగుస్తుందని మహాధర్నా సేన కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ వెల్లడించారు. మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా జరిగే కులగణనలో మున్నూరుకాపులంతా తమ కులాన్ని నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేన కో-కన్వీనర్లు బత్తుల రాములు, రామిని ప్రదీప్, అమరం శ్యామ్, బత్తుల శ్రీనివాస్, సంజీవ్ తదతరులు పాల్గొన్నారు.