హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్తర్వుల ప్రక్రియ నిలిచిపోయిన విషయమూ విదితమే! ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయడంపై అంగన్వాడీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కను మినీ అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉభయ ప్రభుత్వాలకు తాము రుణపడి ఉంటామని ఆమె చెప్పారు.