మెట్రో రుణం నాకు తెల్వదు
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై, మెట్రో విస్తరణకు ఆర్థిక సహకారంలో భాగంగా ఐఆర్ఎఫ్సీ రుణంపై చర్చించామని ఈ ఏడాది జూన్‌లో అధికారికంగా ప్రకటించారు.
- అది నా పరిధిలోకి రాదు: కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
- ఐఆర్ఎఫ్సీ రుణంపై కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల తొండాట
- జూన్‌లో కేంద్రమంత్రితో చర్చించామన్న సీఎం రేవంత్
- అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు సఫలమంటూ సీఎంవో ప్రకటన
- తాజాగా రుణం సంగతే తనకు తెలియదన్న కేంద్రమంత్రి
- మెట్రో టేకోవర్, విస్తరణపై ఆది నుంచీ దోబూచులాట
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై, మెట్రో విస్తరణకు ఆర్థిక సహకారంలో భాగంగా ఐఆర్ఎఫ్సీ రుణంపై చర్చించామని ఈ ఏడాది జూన్‌లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. చర్చలు సానుకూలంగా జరిగాయని స్పష్టంచేశారు. పైగా ఆ భేటీలో కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కలిసి హైదరాబాద్ మెట్రోరైలు గురించి రైల్వేశాఖ మంత్రితో చర్చలు జరిపాం’ అని జూన్ 23న ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కానీ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రం వారిద్దరి ప్రకటనలకు పూర్తి భిన్నంగా స్పందించారు.
ఐఆర్ఎఫ్సీ రుణం సంగతే తనకు తెలియదని ప్రకటించేశారు. మరి.. సీఎం రేవంత్ చెప్పేది నిజమా? రైల్వేశాఖ మంత్రి చెప్పేది వాస్తవమా? పైగా ఇవేవో సాధారణ, ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రకటనలు కావు. ఒకరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకొకరు కేంద్ర రైల్వేశాఖ మంత్రి. కానీ రాత్ గయా.. బాత్ గయా.. అన్నట్టుగా అప్పుడు చేసిన ప్రకటనలకు, ఈరోజు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకుంటే ఎలా? అంతపెద్ద హోదాలో ఉన్నవారి మాటలకే నిలకడ లేకపోతే ఎలా? ఓట్లేసిన జనం ఎవరి మాట నమ్మాలి? ముఖ్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్థాయిలో వంచించడం సబబేనా? అంటూ తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కానీ మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ విస్తరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ దోబూచులాడుతున్నదని మండిపడుతున్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొండాట ఆడుతున్నదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐదు నెలలుగా ఉలుకూపలుకూ లేదు
హైదరాబాద్ మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ 25 ఏండ్లపాటు కష్టమైనా, నష్టమైనా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీ చేసుకున్న ఒప్పంద సారాంశం. 68 కిలోమీటర్ల ఈ మార్గంలో సంవత్సరానికి సుమారు రూ.350 కోట్ల నష్టం వస్తుండగా, ఈ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టింది. ఆ కంపెనీతో ఉన్న విబేధాల కారణంగా రాష్ట్ర సర్కార్ అనాలోచితంగా వ్యవహరించింది. మొదటి దశను టేకోవర్ చేసేందుకు అంగీకరించింది.
అందులో భాగంగా రూ.1,440 కోట్ల నగదును కొన్ని నెలల కిందటే ఎల్అండ్టీకి ఇచ్చింది. కంపెనీపై ఉన్న రూ.13,500 కోట్ల రుణ భారాన్ని ఒక్క ఒప్పందంతో ప్రభుత్వం మీదకు మార్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఐఆర్ఎఫ్సీ (రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకుంది. కేవలం నాలుగు శాతం వడ్డీతో తెస్తున్న ఈ రుణంతో ఇక మెట్రో మొదటి దశ లాభాల్లో పరుగులు పెడుతుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. కానీ రోజుల వ్యవధిలోనే అదే మీడియా ముందు ‘ఐఆర్ఎఫ్సీ రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిలిపివేయించారు. కేంద్రం అడ్డుకోవడంతో ఆ సంస్థ రుణాన్ని ఇవ్వకుండా ఆపింది’ అంటూ ముఖ్యమంత్రి రుసరుసలాడారు. కొన్నిరోజులకే ఈ ఏడాది జూన్ 22న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో, ఆ మరుసటిరోజే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఖట్టర్‌తో సమావేశమయ్యారు.
‘అంతా సవ్యంగా జరిగింది.. కేంద్రంతో కలిసి మెట్రో మొదటి దశను టేకోవర్ చేయబోతున్నాం’ అని సీఎం కార్యాలయం ప్రకటించింది. మధ్యలో పలుమార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి మెట్రో విస్తరణపైనా వినతిపత్రాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ జూన్ నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఐదు నెలలుగా మెట్రో టేకోవర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ.. పలుకూ లేదు. పైగా ఇటీవల సీఎంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ కూడా రూ.13వేల కోట్ల అంచనా విలువతో పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం) మొదటి దశపై వరుస సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో మెట్రో టేకోవర్, విస్తరణపై ఏదో తేడా కొడుతున్నదని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను వీడి పీఆర్టీఎస్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నదంటూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది.
మెట్రోపై ఎందుకీ తొండాట?
మెట్రోపై కాంగ్రెస్-బీజేపీల తీరు ‘నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’ అన్నట్టుగా తయారైంది. మొదట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని, ఆ తర్వాత ఢిల్లీలో అందరూ కలిసి సమావేశమై, ఇప్పుడేమో! మాకేమీ తెలియదన్నట్టుగా ఎవరికివారు చేతులెత్తేస్తున్నారు. ఐఆర్ఎఫ్సీ రుణం కోసం ఫీజు కింద రూ.84 కోట్లు చెల్లించామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు కన్సల్టెన్సీకి చెల్లించిన మరో రూ.176 కోట్లు కూడా వృథా అయ్యాయి. వీటికి అదనంగా టేకోవర్ జాప్యానికి రోజుకు రూ.2 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలు మోయాల్సి వస్తున్నది. అయినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వకుండా దోబూచులాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మెట్రో వ్యవస్థలో వెనుకబడిపోయాం అంటూ తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పట్టాలెక్కిన రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసి మూడేండ్లుగా సాధించినదేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి ఐఆర్ఎఫ్సీ రుణంపై వివరణ ఇవ్వాలని, మెట్రో మొదటి దశ టేకోవర్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

