మాగనూరు : నారాయణపేట( Narayanapet District ) జిల్లా మాగనూరు మండలంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూముల్లో చేపల చెరువు ( Fish Pond ) కోసం భారీగా తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉజ్జలి గ్రామంలో కలకలం రేపుతున్నాయి. ముంపు గ్రామమైన పాత ఉజ్జిలి గ్రామంలో వాడు మెంబర్ల సాయం తో గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జేసీబీతో భూమిని తవ్వి మట్టి తరలిస్తు న్నారు.
ప్రభుత్వ భూమిని చేపల చెరువు కోసం వినియోగించాలంటే సంబంధిత శాఖల అనుమతులు, భూమి స్థితిగతుల పరిశీలన, అధికారిక ప్రక్రియ అవసరమని ప్రభుత్వ మార్గదర్శకాలు సూచిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. చేపల చెరువుల నిర్మాణానికి మత్స్యశాఖ ద్వారా పథకాలు, అనుమతులు అవసరం కాగా ఎవరి అనుమతులు లేకుండానే చేపల చెరువు కోసం తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
మరోవైపు అనుమతులు తీసుకున్నామని వార్డు సభ్యులు, సర్పంచ్ రంగారెడ్డి వివరించారు. గ్రామ అవసరాల కోసం తన భూమిలోనే తవ్వకాలు జరుగుతున్నాయని సర్పంచ్ వెల్లడించారు. ఇదే విషయంపై తహసీల్దార్ రహిమాన్ వివరణ కోరగా తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, అసలు చేపల చెరువు అయితే ప్రభుత్వ భూముల్లో ఏ విధంగా వేసుకుంటారని ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.