హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. విద్యా ప్రమాణాలు పెరిగాయంటూ సీఎం రేవంత్రెడ్డి అంబర్పేట సభలో గొప్పలు చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేయడం, గురుకులాల్లో 150 మంది విద్యార్థుల మరణాలు చోటుచేసుకోవడం విద్యా ప్రమాణాలు పెరిగినట్టా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో దేశంలో ఎకడా లేని విధంగా గురుకులాలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేయడంతోపాటు ‘మన ఊరు-మన బడి’ ద్వారా రూ.7వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినట్టు తుంగ బాలు గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మొన్నటికి మొన్న సంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.1,000 కోట్లు ఏమయ్యాయని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు ఉచిత సూటీల హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన ఉద్యమ నేత కేసీఆర్పై, రేవంత్రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తుంగ బాలు తెలిపారు. కేసీఆర్పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ నేతలు సాయితేజ, శివకుమార్, శ్రవణ్ పాల్గొన్నారు.