హైదరాబాద్ : కొండెక్కిన రేట్లతో నెలలపాటు సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టిన టమాట (Tomato) ధర అమాంతం పడిపోయింది. ఒకానొక దశలో కేజీ రూ.300 దాకా చేరుకుంటుందని చుక్కలు చూపిన టమాటా, ఉహించినట్లుగా ధరలు (Prices) పడిపోతూ వచ్చాయి.
గడిచిన నెల రోజులుగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తోపాటు, మహారాష్ట్ర (Maharastra), కర్ణాటక, చత్తీస్ఘడ్ రాష్ట్రాలో కొత్త పంట మార్కెట్లోకి రావడంతో సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యవసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ.25 పలుకుతుండగా చాలా చోట్ల రూ.15, రూ.20కి దొరుకుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో కిలో మొదటి రకం రూ.25 నుంచి రూ.20 దాకా పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లె (Madanpalle) లో మొదటిరకం కేజీ టమాటా రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో గడిచిన మూడు నెలల పాటు అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు కిలో రూ.100 దాటిన విషయం తెలిసిందే.