Gurukula Recruitment | హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల పోస్టుల్లో మళ్లీ బ్యాక్‌లాగ్‌లు ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది. అందుకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియనే ప్రధాన కారణం. రీలిక్విష్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని మెరిట్‌లిస్ట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
రీలిక్విష్‌మెంట్ లేకుండానే..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో తొమ్మిది క్యాటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్‌కు అప్పగించగా, గత ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. అన్ని పోస్టులకు 1ః2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను కూడా సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోడ్, కోర్టు కేసుల నేపథ్యంలో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ట్రిబ్ ఇటీవలనే మళ్లీ నియామక ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పటికే పీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు మెరిట్ జాబితాలను విడుదల చేసి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసింది.
ఇటీవలనే ఉద్యోగాలకు ఎంపికైన వారినుంచి రీలిక్విష్మెంట్ను తీసుకోకుండానే ట్రిబ్ నియామకపత్రాలను అందజేస్తున్నది. రీలిక్విష్‌మెంట్ ప్రకారం గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు మూడేండ్ల వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ అదే జరిగితే రూ.లక్ష జరినామా చెల్లిస్తామని, ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పందపత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండానే ట్రిబ్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తుండటం గమనార్హం.
బ్యాక్‌లాగ్‌లు తప్పవా?
పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు డీఎల్, జేఎల్‌కు ఎంపికయ్యే చాన్స్ ఉన్నది. దీంతో అత్యధికులు పీజీటీని వదులుకొని జేఎ ల్, డీఎల్ వైపు మొగ్గుచూపుతారు. ఫలితంగా పీజీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో ఆ పోస్టులన్నీ బ్యాక్‌లాగ్‌లో పడిపోతాయి.
నిర్ణయం తీసుకోని సర్కారు
రీలిక్విష్‌మెంట్ అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయమై ట్రిబ్ అధికారులను సంప్రదించగా రీలిక్విష్‌మెంట్ అంశంపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే అమలు చేస్తామని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నియామక పత్రాలనే అందజేస్తున్నామని, పోస్టింగ్‌లు ఇచ్చే సందర్భంలో రీలిక్విష్మెంట్ను తీసుకొనేందుకు అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. అభ్యర్థులు మాత్రం రీలిక్విష్‌మెంట్ తీసుకున్న తరువాతనే నియామక ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని 1ః2 మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.