హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పోలీస్ శాఖ నేతృత్వంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దేశంలోని ఏడు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో హైదరాబాద్ ఒకటి. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టానికి సంబంధించిన ప్రధాన కేసుల పరిశోధన, డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ ప్రింట్స్ వంటి కీలక అంశాలకు సంబంధించి ల్యాబొరేటరీ కావాలంటూ సుమారు మూడుదశాబ్దాల క్రితమే దీనిని ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ రాష్ర్టానికి ప్రత్యేకంగా ఉంటూనే.. ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించిక పలు కీలక కేసుల ఆధారాలనూ ల్యాబ్ కలిగి ఉన్నది. ఈ ప్రయోగశాల డీఎన్ఏ ప్రొఫైలింగ్, సైబర్ ఫోరెన్సిక్, టాక్సికాలజీ , నార్కొటిక్స్ వంటి రంగాల్లో అత్యున్నతమైన సాఫ్ట్వేర్లతో నేర పరిశోధనకు ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారం అందిస్తున్నది.
రాష్ట్ర పోలీసులకు కీలకమైన ఆధారాల సేకరణలో, నేర పరిశోధనలో ల్యాబ్ సేవలందిస్తున్నదని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక్కడున్న పరికరాల విలువ సుమారు వందకోట్లకు పైనే ఉంటుందని సమాచారం. నేరాల నియంత్రణ, న్యాయవ్యవస్థను బలోపేతానికి ఆధారాలను విశ్లేషించడానికి తోడ్పాటునందిస్తున్నది.