హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటి (రెరా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించటంతో పాటు షోకాజ్ నోటీసులకు స్పందించకుండా, రెరా హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రకటనలు, మారెటింగ్ కార్యకలాపాలకు పాల్పడిన సాహితీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10.74 కోట్ల అపరాధ రుసుం విధించింది.
ఈ మొత్తాన్ని చెల్లించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సాహితీ సంస్థపై రెరాకు 132 ఫిర్యాదులు అందాయి. మరోవైపు, సాయి సూర్య డెవలపర్స్ నేచర్ కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ మనసానపల్లిలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో మార్కెటింగ్ చేయటంతో రూ.25 లక్షలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని ప్రాజెక్టు కోసం ఫారం-బీలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, వార్షిక, త్రైమాసిక నివేదికలు సమర్పించనందుకు మంత్రి డెవలపర్స్‌కు 6.50 లక్షల అపరాధ రుసుం విధించింది.