మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 5: రైల్వే కార్మికుల సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) అధ్యక్షుడు, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్‌చేశారు. ఎన్ఎఫ్ఐఆర్ 30వ జాతీయ సమావేశాలను పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయాల వల్ల రైల్వే సంస్థ తీవ్రంగా నష్టపోతున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైల్వేను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని విరమించుకోవాలని సూచించారు.
కొవిడ్ కష్టకాలంలో కూడా రైల్వే ఉద్యోగులు సేవలు అందించారని, కొవిడ్‌తో 3,200 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. 119 మార్గాల్లో ప్రైవేట్ రైళ్లను నడపడానికి చర్యలు చేపడుతున్నారని, తద్వారా లక్ష 52 వేల కోట్లు ఆశిస్తున్నారని తెలిపారు. ముక్కలు, ముక్కలుగా రైల్వేలను అమ్మడం సరికాదని పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఐఆర్ అధ్యక్షుడు గుమాన్‌సింగ్ మాట్లాడుతూ.. రాజస్థాన్ ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసిందని, కేంద్రం కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కరువు భత్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.
8 గంటల పని విధానం అమలుచేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ బాడి సమావేశం, 7 రైల్వేలో ఎదుర్కొంటున్న సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సంఘ్ ఉపాధ్యాక్షుడు భరణి భానుప్రసాద్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్పీ భట్నాగర్ మీజమా, సంఘ్ నాయకుడు రుద్రారెడ్డి, ప్రతినిధి షేక్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.