హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ తెలిపారు. బాసరలోని ఆర్జీయూకేటీలో మొత్తం 1500 సీట్లున్నాయి. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీచేస్తారు.
ఈ ఏడాది దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానించారు. దీంతో విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్, పేరు వంటి వివరాలు నమోదుచేయగానే ఆటోమెటిక్‌గా వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని వెంకటరమణ తెలిపారు. వివరాల కోసం www.rgukt.ac. in వెబ్‌సైట్‌ను, 7416305245, 7416058245, 7416929245 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.