బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
కుక్కను చంపే ముందు.. దానికి పిచ్చిదనే ముద్ర వేయాలనేది రాజ్యతంత్రం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తంత్రాన్ని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మీద ప్రయోగిస్తున్నది. బోర్డులో అవినీతిపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతులేని అవినీతిని ప్రోత్సహించిందనే ఆరోపణలు వచ్చాయి. ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలోనూ అనినీతి గుట్టు రట్టయ్యింది.
- విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టి మళ్లీ విచారణ డ్రామా
- బోర్డులో అవినీతిపై 2022లోనే విజిలెన్స్ ఎంక్వైరీ
- రెండేండ్లు పరిశోధించి 80 పేజీల నివేదిక తయారు
- కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు.. నేటికీ చర్యల్లేవ్
- రెండున్నరేండ్లుగా విచ్చలవిడి అవినీతికి అవకాశం
- డైవర్షన్ కోసం గత పాలకులపై కొత్త విజిలెన్స్ దర్యాప్తు
- తప్పుడు క్లెయిమ్‌ల ముసుగులో రూ.150 కోట్ల స్కామ్
- బీమా పేరుతో 346 కోట్లు ట్రయల్ బ్లేజర్ ఖాతాలోకి
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: మంత్రి సిఫార్సు లేఖలనే అర్హతా పత్రాలుగా భావించి, అనర్హులకు రూ.లక్షలు అప్పగించిన వైనం బయటికి వచ్చింది. మొత్తంగా ఒక సిండికేట్ వ్యవస్థ ఏర్పడి రూ.150 కోట్లు దిగమింగిన ఉదంతం వెలుగుచూసింది. మరి అకస్మాత్తుగా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకంటే.. ఈ అవినీతిని ఎత్తిచూపి, బోర్డు స్వయంప్రతిపత్తిని సమాధి చేయడమే పాలకుల అసలు ఎజెండాగా తెలుస్తున్నది. కార్మికుల రక్తమాంసాలతో బోర్డు ఖజానాలో పోగైన రూ.వేల కోట్ల నిధులను కొల్లగొట్టి, రాబోయే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ముసుగులోకి లాగి, బంధుగణానికి దళారీ లాభాలు దోచిపెట్టే పకా కార్పొరేట్-రాజకీయ వ్యాపార వ్యూహం తయారైనట్టు సమాచారం.
అయితే నేరుగా స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తే, జరిగిన అవినీతి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. పోనీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేద్దామంటే 80 పేజీల నివేదిక అడ్డంకిగా మారింది. బోర్డుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలంటూ 2022లో నాటి సీఎం కేసీఆర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించారు. అధికారులు రెండేండ్లు జల్లెడపట్టి తయారు చేసిన నివేదికలో కేవలం రూ.36 లక్షలు పక్కదారిపట్టినట్టు తేల్చారు. దీంతో ఈ నివేదిక ఆధారంగా తమ ప్లాన్‌ను అమలు చేయలేమని కాంగ్రెస్ పెద్దలకు తెలిసివచ్చింది.
దీంతో 2018 కటాఫ్‌గా నిర్ణయించి కొత్తగా విజిలెన్స్ విచారణ పేరుతో నాటకాన్ని మొదలు పెట్టింది. గత మూడేండ్లలో జరిగిన అవినీతిని సైతం బీఆర్ఎస్ ప్రభుత్వంపైకి నెట్టి అటు స్వామికార్యాన్ని, ఇటు బోర్డు స్వతంత్రతను రద్దు చేసి స్వకార్యాన్ని సాధించుకునేలా ప్లాన్ వేసినట్టు సమాచారం. ఒకవేళ పాత నివేదిక లేదు అని కార్మిక శాఖ అధికారులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ బుకాయిస్తే.. 80 పేలజీ నివేదిక ప్రతులను అందించటానికి ‘నమస్తే తెలంగాణ’ సిద్ధంగా ఉన్నది.
విచారణకు ఆదేశించిన కేసీఆర్ ప్రభుత్వం
బోర్డులో అవినీతి లేదా? అంటే ఉన్నది. ఒకే అధికారి ఏకఛత్రాధిపత్యంగా ఏండ్ల తరబడి సీఈవో కుర్చీలో కూర్చొని నిర్మించిన అక్రమ సామ్రాజ్యం ఉన్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి ప్రక్షాళన మొదలుకావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బోర్డులో అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు. బోర్డులో తీవ్రస్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని, అనర్హులు అక్రమంగా లబ్ధి పొందుతున్నారని, జిల్లాల్లో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, బోగస్ కార్డులు సృష్టించి కార్మిక సంక్షేమ బోర్డు నిధులను స్వాహా చేస్తున్నారని 2022 అక్టోబర్ 26న అప్పటి సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీనిపై నాటి సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. 2022 నవంబర్‌లో విజిలెన్స్ అధికారులు దర్యాఫ్తును ప్రారంభించారు. అధికారులు దాదాపు రెండేండ్లపాటు రాష్ట్రమంతటా పర్యటించి, జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. సంక్షేమ బోర్డుకు సమర్పించిన పత్రాలను క్షేత్రస్థాయి రికార్డులతో సరిపోల్చారు. సహాయ కార్మిక అధికారులను, జిల్లా కార్మిక అధికారులను విచారించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖల రికార్డులతో సరిపోల్చి చూశారు. లబ్ధిదారుల వాంగ్మూలాలను సాక్ష్యాధారాలతో నమోదు చేశారు.

ప్రభుత్వం ముందు 80 పేజీల నివేదిక
విజిలెన్స్ అధికారుల సుదీర్ఘ పరిశోధన అనంతరం 2025 జనవరి 1న 80 పేజీల విపుల నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించారు. ఫిర్యాదుదారు ఆరోపించినట్టు బోర్డు నుంచి జరిగిన చెల్లింపులన్నీ అక్రమాలు కావని కమిటీ తేల్చి చెప్పింది. నల్లగొండ జిల్లాలో సమర్పించిన ధ్రువపత్రాలన్నీ సరైనవేనని నిర్ధారించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 21 మంది లబ్ధిదారులకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్వో) నిబంధనల ప్రకారం విచారించిన అనంతరమే పరిహారం అందినట్టు తేల్చింది.
చౌటుప్పల్‌లో ఒక నకిలీ క్లెయిమ్ వెలుగుచూసినా, తప్పుడు బ్యాంక్ ఖాతా నంబర్ కారణంగా నిధులు బయటకు వెళ్లకుండా నిలిచిపోయాయని కమిటీ పేర్కొన్నది. అయితే సూర్యాపేట జిల్లాలో మాత్రం కొందరు ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్‌లు పొందినట్టు కమిటీ నిర్ధారించింది. దాదాపు రూ.39 లక్షల మేర నిధులు దారితప్పినట్టు తేల్చి చెప్పింది. ఇందుకు బాధ్యులైన 8 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలకు, నకిలీ క్లెయిమ్‌లపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు చేసింది.
భవిష్యత్తులో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలని, క్షేత్రస్థాయి తనిఖీ లేని మరణ క్లెయిమ్‌లను తిరసరించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అవినీతిలో దిగువ స్థాయి అధికారుల ప్రమేయాన్ని విజిలెన్స్ నిర్ధారించింది. అంటే బోర్డు కార్యకలాపాల్లో నాటి బీఆర్ఎస్ రాజకీయ నాయకుల ప్రమేయం ఏమీ లేదని, కొందరు క్షేత్రస్థాయి అధికారులు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని నివేదిక స్పష్టం చేసింది. దీంతోపాటు బోర్డు ప్రక్షాళనకు 13 విలువైన సలహాలు, సూచనలు చేసింది. ఈ నివేదిక ఇంకా ప్రభుత్వ పెద్దల బల్లలపైనే ఉన్నది.
పిచ్చిదనే ముద్ర వేయాలని..
విజిలెన్స్ నివేదిక ప్రభుత్వ పెద్దలను సంతృప్తిపరచలేదు. తమ ప్లాన్‌కు అనుగుణంగా కార్మిక సంక్షేమ బోర్డు స్వయంప్రతిపత్తిని దెబ్బతీసి, దాన్ని బోనులోకి ఎక్కించి, సుప్తచేతనావస్థలోకి పంపాలంటే.. గత 80 పేజీల నివేదిక సరిపోదని ముఖ్యనేత సలహాదారులు చెప్పినట్టుగా తెలుస్తున్నది. సరికొత్తగా నివేదిక రావాలని, అందులో భారీ అవినీతిని ఎత్తి చూపాలని, బోర్డు సంపూర్ణంగా పుచ్చుపట్టిపోయిందనేలా ఉండాలని సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది.
వాస్తవానికి ప్రభుత్వం అనుకున్న నివేదిక కావాలంటే 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు విచారణ జరిపితే సరిపోతుందని, అంచనాలకు మించిన అవినీతి గుట్టు బట్టబయలు అవుతుందని కార్మిక కాఖ అధికారులే చెప్తున్నారు. కానీ తమ హయాంలో జరిగిన రూ.150 కోట్ల అక్రమాలను, బీమా కేటాయింపుల్లో సాగిన బ్రోకరేజీ బాగోతాలను కప్పిపుచ్చి, మొత్తం పాపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాతాలో వేయాలనే కుతంత్రంతోనే 2018ని కటాఫ్‌గా తీసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాత అంశాల మీద విచారణ ఎందుకు?
బోర్డులో అవినీతిపై బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పుడు సీఈవోగా గంగాధర్ ఉన్నారు. ఇప్పటికీ ఆయన అదే కుర్చీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 2018 కటాఫ్‌గా నిర్ణయించి, విచారణకు అదేశించిన అంశాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం గతంలో విచారించిన అంశాలే కావడం గమనార్హం. అయినా ‘అయిపోయిన పెండ్లికి మళ్లీ డప్పులు కొట్టడం’ వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణంలో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అప్పుడు, ఇప్పుడు సీఈవో ఒక్కరే అయినప్పుడు గత మూడేండ్లలో జరిగిన అవినీతిని కొత్తగా విచారించి, పాత 80 పేజీల నివేదికను జతచేస్తే సరిపోతుంది కదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ పాత నివేదిక లేదు అని కార్మిక శాఖ అధికారులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ బుకాయిస్తే.. 80 పేజీ నివేదిక ప్రతులను అందించటానికి ‘నమస్తే తెలంగాణ’ సిద్ధంగా ఉన్నది. అసలు దర్యాప్తు జరగాల్సింది గత పాలన మీద కాదని, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో శవాల మీద ఏరుకున్న రూ.150 కోట్ల పేలాల మేత మీద జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాద మరణం, సహజ మరణం, పాక్షిక, శాశ్వత వైకల్యం, మెటర్నిటీ బెనిఫిట్ పథకాల నిర్వహణ నుంచి కార్మిక సంక్షేమ బోర్డు అనూహ్యంగా తప్పుకొని ప్రైవేట్ బ్రోకర్ కంపెనీ ట్రయల్ బ్లేజర్‌కు అప్పగించటం వెనుక జరిగిన లావాదేవీల మీద విచారణ జరగాలని స్పష్టం చేస్తున్నారు. కనీసం రూ.3 కోట్ల మూలధనం లేని బ్రోకరేజీ కంపెనీ ఖాతాలోకి రూ.346 కోట్ల కార్మిక నిధులను ఎలా మళ్లించారనే దానిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమాలు నిజం.. ఖండన లేఖనే సాక్ష్యం… శాఖ వివరణలో బయటపడ్డ డొల్లతనం
కార్మిక సంక్షేమ బోర్డులో జరుగుతున్న అవినీతి దందాను ఆ శాఖే అధికారికంగా ధృవీకరించింది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధుల దుర్వినియోగం, మరణ ప్రయోజనాల క్లెయిమ్‌లలో యథేచ్ఛగా సాగిన అక్రమాలు, నిధుల మళ్లింపులపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వెలికితీసిన సంచలనాత్మక వ రుస కథనాలను ఖండిస్తూ బుధవారం కార్మిక శాఖ కార్యదర్శి, బోర్డు సీఈవో గంగాధర్ వివరణ లేఖ విడుదల చేశారు. ఇందులో పత్రికలో వచ్చిన కథనాలు నిరాధారమైనవని, వక్రీకరించినవని, క్లెయిమ్‌లలో అక్రమాలు జరగలేదని చెప్తూనే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ఎనిమిదేండ్ల క్లెయిమ్‌లపై సమగ్ర ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగించామని స్వయంగా అంగీకరించారు.
బీమా విలీనంపై దాటవేత
భవన నిర్మాణ కార్మికుల బీమా నిధులను, మొత్తం యంత్రాంగాన్ని ఇందిరమ్మ కుటుంబ బీమాలో విలీనం చేయబోతున్నారన్న అనుమానాలను బోర్డు తన వివరణలో నివృత్తి చేయలేకపోయింది. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరికీ ఒకే గొడుగు కింద నిరంతరాయ రక్షణ కల్పించేందుకే సమీకృత ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రతిపాదనను తెరపైకి తెచ్చామని పేర్కొన్నది. అంటే కార్మిక బీమాను కుటుంబ బీమాలో కలిపే ప్రక్రియ జరుగుతున్న మాట వాస్తవమేనని బోర్డే స్వయంగా అంగీకరించింది. బోర్డు వద్ద నమోదైన కార్మికుల సంఖ్యకు తగిన ప్రీమియం మాత్రమే చెల్లిస్తామని, సంక్షేమ బోర్డు నిల్వలను దారిమళ్లించడం లేదని పేర్కొన్నా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డు నిధులను ఇందిరమ్మ బీమా పథకానికి ఖర్చు పెట్టడం వెనుక అసలు ఉద్దేశాలపై మాత్రం స్పష్టత రాలేదు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం సంక్షేమ బోర్డు మూతపడబోదని లేఖలో చెప్పినా, కార్మిక బీమాను ప్రభుత్వ సాధారణ బీమా పథకంలో విలీనం చేసిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏమిటనే కీలక అంశాన్ని దాటవేశారు.
నిబంధనల మేరకే 631 కోట్ల మళ్లింపు
పారిశ్రామిక శిక్షణా సంస్థలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రాజెక్టు కోసం కార్మిక సంక్షేమ నిధుల నుంచి ఏకంగా రూ.631 కోట్లు వెచ్చించినట్టు బోర్డు తన లేఖలోనే అధికారికంగా ధ్రువీకరించింది. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబాల నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ నిధులు ఇచ్చామంటూ చట్టంలోని సెక్షన్ల ద్వారా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే కార్మికుల సంక్షేమ నిల్వల నుంచి భారీ మొత్తాన్ని ఇతర విభాగాల మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. మంత్రుల కార్యాలయాల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలతో క్లెయిమ్‌లు మంజూరు కాలేదని చెప్తూనే, క్షేత్రస్థాయి తనిఖీలలో లోపాలు తలెత్తకుండా బహుళ స్థాయి డిజిటల్ పరిశీలనలతో కూడిన కొత్త విధానాలను రూపొందిస్తున్నామని ప్రకటించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే.. శాఖలో లొసుగులు ఉన్నాయని బోర్డు స్వయంగా అంగీకరించింది.
‘నమస్తే’ చేతిలో ఆ నివేదిక లేదంటున్న అధికారులకు ఇచ్చేందుకు సిద్ధం
కార్మిక సంక్షేమ బోర్డుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలని 2022లోనే నాటి సీఎం కేసీఆర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించారు. అధికారులు రెండేండ్లు జల్లెడపట్టి తయారు చేసిన నివేదికలో కేవలం రూ.36 లక్షలు పక్కదారిపట్టినట్టు తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా తమ ప్లాన్ అమలు చేయలేమని కాంగ్రెస్ పెద్దలకు తెలిసివచ్చింది. అందుకే 2018 కటాఫ్‌గా నిర్ణయించి కొత్తగా విజిలెన్స్ విచారణ పేరుతో నాటకం మొదలు పెట్టింది. ఒకవేళ ‘పాత నివేదిక లేదు’ అని కార్మిక శాఖ అధికారులో, రాష్ట్ర ప్రభుత్వమో బుకాయిస్తే.. 80 పేజీల నివేదిక ప్రతులను అందించడానికి ‘నమస్తే తెలంగాణ’ సిద్ధంగా ఉన్నది.
‘631 కోట్లు మళ్లించాం’.. అవినీతి లేదంటూనే బోర్డు వింత ప్రకటన
పారిశ్రామిక శిక్షణ సంస్థలను అధునాతన శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రాజెక్టు కోసం కార్మిక సంక్షేమ నిధుల నుంచి ఏకం గా రూ.631 కోట్లు వెచ్చించినట్టు బోర్డు తన లేఖలోనే అధికారికంగా ధ్రువీకరించింది. సిఫార్సు లేఖలతో క్లెయిమ్‌లు మంజూరు కాలేదని చెప్తూనే, క్షేత్రస్థాయి తనిఖీల్లో లోపాలు తలెత్తకుండా బహుళ స్థాయి డిజిటల్ పరిశీలనతో కూడిన కొత్త విధానాలు రూపొందిస్తున్నామని శాఖలో లోపాలు, లొసుగులను చెప్పకనే చెప్పింది. కాగా కార్మికుల అత్యవసర సంక్షేమ నిల్వల నుంచి ఇంత భారీ మొత్తాన్ని ఇతర విభాగా ల మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు కేటాయించడం వివాదాస్పదంగా మారింది.
మూడేండ్లలో రూ.500 కోట్ల అక్రమాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు మూడేండ్లలోనే కార్మిక బోర్డులో రూ.500 కోట్ల వరకు నిధుల లావాదేవీలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పాలనా కాలంలో కార్మికుల బీమా పథకాలను సంక్షేమ బోర్డు నిర్వహించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే బీమా బాధ్యతల నుంచి బోర్డు అనూహ్యంగా తప్పుకున్నది. ప్రైవేట్ మధ్యవర్తి సంస్థలకు అప్పగిస్తూ 2025 జూన్ 22న జీవో 12 జారీ చేసింది. ఈ నిర్ణయం తర్వాత రెండు రోజుల్లోనే ముంబైకి చెందిన ట్రయల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి రూ.346 కోట్లు జమ చేశారు. కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.3 కోట్లు, చెల్లింపు మూలధనం రూ.2.50 కోట్లు మాత్రమే ఉన్న అతి చిన్న సంస్థ ఇది. అయినా నిధులు విడుదలయ్యాయి.
అది కూడా బోర్డు చైర్మన్ లేని సమయంలో చైర్మన్ అనుమతి లేకుండా అంత మొత్తం నిధులు బోర్డు ఖాతా నుంచి బయటకు తీయటం చట్ట విరుద్ధమని తెలిసినా.. ఇప్పుడున్న బోర్డు సీఈవో గంగాధర్, అప్పుడున్న కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఈ సాహసం చేసినట్టు కార్మికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ ఇన్యూరెన్స్ దిగ్గజ సంస్థలను కాదని అతి చిన్న ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగించారనేది ఇప్పటికీ రహస్య మే. అవినీతి కొత్త అవతారం ఎత్తింది.
బతికి ఉన్నవారికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించడం, చనిపోయిన తర్వాత పాత తేదీలతో లేబర్ కార్డులు జారీ చేయడం, సహజ మరణాలను సైతం ప్రమాద మరణాలుగా రికార్డుల్లో చూపిస్తూ ఎలాంటి తనిఖీలు లేకుండానే క్లెయిమ్‌లను మంజూరు చేసిన వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా బోర్డులో సాగిన రూ.150 కోట్ల బీమా దోపిడీపై నిష్పక్షపాత విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ రెండు వ్యవహారాల్లో కలిపి అక్రమ ఆరోపణలు ఉన్న మొత్తం రూ.500 కోట్లు. ఇందులో బోర్డు సీఈవో పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీసీఐడీకి అప్పగించాల ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కార్మికుల సంక్షేమ నిధుల దుర్వినియోగంపై రేపు బీఆర్టీయూ మహాధర్నా
హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 16న ఉదయం 11గంటలకు చిక్కడపల్లిలోని కార్మికశాఖ భవన్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం చిక్కడపల్లిలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద మహాధర్నా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులను ఇతర సంస్థలకు బదిలీ చేయడాన్ని తప్పుబట్టారు.
బీమా సొమ్మును కార్మికుల ప్రయోజనాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమ నిధుల పరిరక్షణ కోసం నిర్వహించే మహా ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ల తో సహా 18 రకాల భవన నిర్మాణ రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర కార్మిక నాయకుడు డీ హరీశ్, నాయకులు బత్తుల రాజశేఖర్, ఎం గణేశ్, సురేశ్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలు లేకపోతే సస్పెన్షన్లు ఎందుకు?
క్లెయిమ్‌లలో ఎలాంటి దందా జరుగలేదని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే అదే లేఖలో మంచిర్యాల జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్టు అంగీకరించడం గమనార్హం. తగిన క్షేత్రస్థాయి విచారణ చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నమస్తే తెలంగాణ కథనంలో కూడా ఇదే చెప్పినా, నిరాధారం అని ఎందుకు ఖండించినట్టు? క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో వ్యవస్థీకృత లోపాలు, తీవ్రమైన అవకతవకలు జరుగకపోతే ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు ఎందుకు వేసినట్టు? రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ఆదేశించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అనేది ప్రాథమిక ప్రశ్నగా మిగిలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

