హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని విస్తృతపరచడంపై తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీటీడీసీ) దృష్టి సారించింది. పర్యాటక అభివృద్ధి కోసం ‘హోమ్‌స్టే’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పర్యాటక అభివృద్ధి కోసం ‘హోమ్‌స్టే’ విధానం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కానీ, 2020లో కరోనా మహమ్మారి విజృంభణతో బ్రేక్ పడింది.
తాజాగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఈ హోమ్‌స్టే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో సభ్యులుగా చేరేందుకు గ్రామీణ ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆసక్తి గలవారు సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందులో సిల్వర్ క్యాటగిరీ కోసం రూ.2,000, గోల్డ్ క్యాటగిరీ కోసం రూ.4,000 ఫీజుగా నిర్ణయించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి సౌకర్యం కల్పించడంతోపాటు స్థానిక సంప్రదాయాలపై అనుభూతి కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు తెలంగాణ వంటల రుచిని ఆస్వాదించేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆ శాఖ అధికారులు సూచించారు.