ప్రిన్సిపాళ్ల సామూహిక తిరుగుబాటు.. మూకుమ్మడిగా సెలవులపై వెళ్లేందుకు నిర్ణయం
ప్రభుత్వంపై ఎస్సీ గురుకుల సొసైటీలోని ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లు తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. తమను బాధ్యతల నుంచి తప్పించాలని, లేదంటే సామాహిక సెలవులపై వెళ్లిపోతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గురుకుల వర్గాల్లో ఈ మేరకు జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.
- ఎస్సీ గురుకులంలో ముసలం
- 150 చోట్ల ఇన్‌చార్జులతోనే పాలన
- సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు బాధ్యతలు
- రెండేండ్లుగా ప్రమోషన్లంటూ ఊరిస్తున్న సర్కార్
- అందుకోసం బదిలీలు సైతం నిలిపివేత
- ఓ ఉన్నతాధికారి తీరుపై అసోసియేషన్ల ఆగ్రహం
- ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంపై ఎస్సీ గురుకుల సొసైటీలోని ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లు తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. తమను బాధ్యతల నుంచి తప్పించాలని, లేదంటే సామాహిక సెలవులపై వెళ్లిపోతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గురుకుల వర్గాల్లో ఈ మేరకు జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. నానా కొర్రీలతో సుదీర్ఘకాలంగా ప్రమోషన్లు కల్పించకపోవడం, ఆ పేరిట బదిలీలనూ నిర్వహించకపోవడం, తాజాగా మరోసారి డీపీసీ కమిటీలను వేసి జాప్యం చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ప్రమోషన్ల ప్రక్రియతోపాటు గురుకుల వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారే కారణమని, ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలా లేదని, మంత్రి ఉన్నా లేనట్లుగా పరిస్థితి తయారైందని గురుకుల ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కీలక పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జులతోనే పరిపాలన కొనసాగుతున్నది.
సుమారు 150 గురుకులాల్లో ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు, 8 జోన్లకుగాను ఆరుచోట్ల ఇన్చార్జి జోనల్ అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయా పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మరోవైపు, సొసైటీ ఉన్నతాధికారులు డిప్యూటేషన్లపై పలువురికి అడ్డదారిలో కీలక స్థానాలను అప్పగించారనే ఆరోపణలున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా, సొసైటీ సిబ్బందితో, అదీ డిప్యుటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో ఏండ్లకు ఏండ్లుగా అక్రమమార్గంలో తిష్ట వేసిన వారితోనే భర్తీ చేయడం గమనార్హం. ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగకుండా ఓ ఉన్నతాధికారి మొదటినుంచీ అనేక కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. సదరు అధికారిపై ప్రధాన కార్యాలయానికి, మంత్రి పేషికి ఇప్పటికే అనేక ఫిర్యాదులందాయి. అయినప్పటికీ, విచారణా లేదు. చర్యలూ లేవు. గతంలో సదరు అధికారి తీరు వల్లే ప్రమోషన్ల ప్రక్రియ గందరగోళంగా మారిందని గురుకుల టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పనిభారంతో సామూహిక తిరుగుబాటు
సొసైటీ ఉన్నతాధికారుల, మంత్రి తీరుతో విసిగిపోవడమేగాక, పనిభారం భరించలేక ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. గురుకులంలో ఎక్కడైనా ప్రిన్సిపాల్ పోస్టు ఖాళీ ఏర్పడితే, తక్షణమే వేరొకరిని నియమించడం, లేదంటే అప్పటివరకు అక్కడున్న సీనియర్ సబ్జెక్టు టీచర్లలో ఒకరికి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించడం పరిపాటి. ప్రస్తుతం అలా 150 చోట్ల ఇన్చార్జులే ప్రిన్సిపాళ్లుగా ఉన్నారు. ప్రిన్సిపాల్‌గా నియమితులైనవారు విద్యార్థులకు భోజనం, వసతి, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించడంతోపాటు సబ్జెక్టు టీచర్లుగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. హెడ్ ఆఫీస్, జిల్లా అధికారుల నుంచి వివిధ నివేదికలు, సమాచార సేకరణ, ఆన్లైన్లో వివరాల సమర్పణ వంటి బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. దీంతో ఇన్చార్జి ప్రిన్సిపాల్స్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిపోయిందని గురుకుల టీచర్లు వివరిస్తున్నారు.
చాలాచోట్ల ప్రిన్సిపాల్స్‌గా బాధ్యతలను తీసుకొనేందుకు సీనియర్లు ముందుకు రాని దుస్థితి నెలకొన్నది. దీంతో చేసేదేమీలేక జూనియర్లకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించి సొసైటీ నెట్టుకొస్తున్నదే తప్ప ప్రమోషన్ల ప్రక్రియను ముందుకు తీసుకొనిపోవడం లేదు. ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనేకమందికి ఇప్పటికీ అధికారిక ఉత్తర్వుల ప్రతులు అందలేదంటే సొసైటీలో పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పూర్తిస్థాయి అధికారాలు, విధుల పరిధిపై స్పష్టత లేకుండానే కీలకమైన బాధ్యతలు చూడాల్సి రావడం కూడా అయోమయానికి గురిచేస్తున్నదని ఇన్చార్జీలు వాపోతున్నారు. పాఠశాలల్లో ఏదైనా సమస్య తలెత్తితే బాధ్యత ఎవరిది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? భవిష్యత్తులో సర్వీసుపరమైన ఇబ్బందులు ఎదురవుతాయా? అనే సందేహాలున్నాయని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా పోతున్నదని, అది అనేక ఇబ్బందులకు దారితీస్తున్నదని వివరిస్తున్నారు.
పనిభారం మోపుతున్న సొసైటీ.. తమకు అదనపు అలవెన్స్ల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రమోషన్ల ప్రక్రియను సత్వరం చేపట్టాలని, సమస్యకు పరిషారం చూపాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు సామూహిక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని గురుకులంలో చర్చ కొనసాగుతున్నది. సామూహికంగా సెలవులు పెట్టి వెళ్లాలని, నిరసన తెలు పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో తమను బాధ్యతల నుంచి తప్పించాలని పలువురు ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ అక్కడి జోనల్ ఆఫీసర్లకు దరఖాస్తులు సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అన్ని జిల్లాలోనూ ఇన్చార్జీలు అదే బాట పట్టనున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని సొసైటీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

