హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో, ఇప్పటికే ఉన్న ప్లాంట్లు నడుపడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడేండ్లుగా ఒడిదుడుకుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యుత్తు రంగం ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యుత్తు వినియోగం, డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జెన్కో ప్లాంట్లలో రోజుకు 100 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. కానీ, రాష్ట్ర వినియోగం మాత్రం 320 మిలియన్ యూనిట్లుగా ఉన్నది.
రోజుకు 140-120 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అత్యవసరంగా కొనుగోలు చేయాల్సి వస్తున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు గణనీయంగా పెరుగుతుంటే.. సొంత ఉత్పత్తితో వినియోగాన్ని తీర్చలేని పరిస్థితిలోకి సర్కార్ నెట్టింది. థర్మల్ప్లాంట్లకు బొగ్గు కొరత ప్రధాన సవాల్‌గా మారింది. యాదాద్రి ప్లాంట్‌లో 4 రోజులకే సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయి. కేంద్రం నిబంధనల ప్రకారం ప్లాంట్లలో 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ, అనేక ప్లాంట్లలో వారం రోజులకు సరిపడే నిల్వలు కూడా లేకపోవడం ఆందోళనకరం. ఇదిలా ఉంటే జెన్కో ప్లాంట్లు వరుసగా షట్‌డౌన్ అవుతున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయడమే శరణ్యమైన దుస్థితి దాపురించింది.
రాష్ట్రంలోని జల విద్యుదుత్పత్తి కేంద్రాలు ఇప్పటికే పడావు పడ్డాయి. పలు ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. వీటి నుంచి వస్తున్న విద్యుత్తు 9-7 మిలియన్ యూనిట్లు మాత్రమే. ప్రియదర్శిని జురాల 234 మోగావాట్లు, లోయర్ జురాల 240, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ 60, పులిచింతల 120, సింగూరు 15, నిజాంసాగర్ 10, పోచంపాడు 36, పెద్దపల్లి మినీ హైడ్రో 9.2, పాలేరు హైడ్రో ప్రాజెక్ట్‌లో 2 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి జరిగేది. కానీ, ఇప్పుడు వాటిలో ఏ ఒక్కటి కూడా నడువడం లేదు. 900 మోగావాట్ల శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో రోజుకు 5-6 మిలియన్ యూనిట్లకు మించి విద్యుదుత్పత్తి కావడమే లేదు. 815 మెగావాట్ల నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రంలో రోజుకు కేవలం 2 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది.
విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, ఉత్పత్తి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు ముందుచూపు కొరవడింది. కరెంట్ ఉత్పత్తి వేగం మన రాష్ట్రంలోనే నెమ్మదించినట్టు కేంద్ర విద్యుత్తుశాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పెరుగుదల రేటు స్వల్పంగా ఉన్నట్టు కేంద్రం గతంలోనే హెచ్చరించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైంది. రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టింది. రాష్ట్రంలో 2014-15 సంవత్సరంలో విద్యుదుత్పత్తి 40,433 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా, 2025-26కు వచ్చేసరికి 73,319 మిలియన్ యూనిట్లకు చేరింది. ఆ తర్వాత పెరుగుదల నెమ్మదించింది. ఇదే సమయంలో గుజరాత్ 1.46 లక్షలు, మహారాష్ట్ర 1.72 లక్షలు, ఉత్తరప్రదేశ్ 1.77లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ర్టాలు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని లక్షల మిలియన్ యూనిట్లకు పెంచుకుంటున్నాయి. అదే తెలంగాణలో విద్యుదుత్పత్తి ఆశించిన స్థాయిలో పెరుగకపోవడమే ప్రస్తుతం విద్యుత్తురంగం ఒడిదుడుకులకు కారణమైంది.
జెన్కోకు చెందిన విద్యుత్తు ప్లాంట్లు తరచూ షట్‌డౌన్ అవుతున్నాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి విఫలమవుతున్నాయి. ఒకదానిని బాగు చేయగానే మరొక ప్లాంట్‌లో సమస్య తలెత్తుతున్నది. సెప్టెంబర్‌లో భదాద్రి ప్లాంట్‌లోని రెండు యూనిట్లు బంద్ అయ్యాయి. ఇదే ప్లాంట్‌లోని 270 మెగావాట్ల యూనిట్-3 సెప్టెంబర్ 9 నుంచి నడువడమే లేదు.
యాదాద్రిలో 4 యూనిట్లకు మూడు బంద్ అయ్యాయి. వాటిని మరమ్మతు చేసి పునరుద్ధరించారు. వైటీపీఎస్‌లోని 800 మెగావాట్ల యూనిట్-1 సెప్టెంబర్ 28 నుంచి నడువడం లేదు. ఈ వారంలోనే కొత్తగూడం థర్మల్ప్లాంట్లోని యూనిట్-12 కూడా సాంకేతిక సమస్యతో షట్‌డౌన్ అయ్యింది. తాజాగా మంగళవారం జెన్కో హైడల్ ప్లాంట్లు రెండింటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలోని యూనిట్-2, యూనిట్ -4 బంద్ అయ్యాయి. దీంతో 300 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయింది.