Police Housing Corporation | తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశం జరిగింది.
సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, డీఐజీ రమేశ్‌రెడ్డి, కార్పొరేషన్ సీఈవో విజయ్‌కుమార్, రక్షిత మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనుల్లో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రస్తుతం ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్టం చేయాలని, ఈ విభాగంలో నిపుణులైన అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న అకౌంట్స్ విభాగాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఫైనాన్స్, అకౌంట్స్ విభాగానికి ప్రత్యేకంగా సీనియర్ అధికారిని డిప్యుటేషన్ పద్ధతిపై నియమించాలని సమావేశం నిర్ణయించింది.