హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అక్రమాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ రూపంలో రూ.కోట్లలో వసూలు చేస్తున్న కౌన్సిల్ అధికారులు ఆ నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో నర్సింగ్ విద్యను పూర్తి చేసినవారి కొత్త రిజిస్ట్రేషన్లు, విధుల్లో ఉన్న నర్సుల ఐదేండ్ల రెన్యువల్స్, వెరిఫికేషన్లు, అదనపు అర్హతల పేరిట వసూలు చేస్తున్న కోట్ల నిధులు నర్సింగ్ కౌన్సిల్ ఖాతాలో ఎప్పటికప్పుడు జమ అవుతున్నాయి.
అయితే ఈ నిధుల వినియోగంపై పూర్తిస్థాయి లెక్కలు చూపడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. నర్సింగ్ కౌన్సిల్లో ఇప్పటివరకు మొత్తం 74,382 మంది ఎన్రోల్ చేసుకున్నారు. 72,763 మంది దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. 64,496 అప్రూవ్ కాగా, 59,649 నర్సు యూనిక్ ఐడెంటిటీ నంబర్(ఎన్యూఐడీ) కార్డులు మంజూరు చేశారు. ఇందులో 10వేల మంది లేట్ ఫీజు రూ.5 వేలు చెల్లించినట్టు తెలిసింది. ఎన్యూఐడీ కార్డులకు ఒక్కో నర్సింగ్ ఆఫీసర్ రూ.1,500 నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేస్తున్నారు. లేట్ ఫీజుతో రెన్యువల్‌కు రూ.5వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం రూ.కోట్లల్లో కౌన్సిల్ ఖాతాలోకి నిధులు జమ అయ్యాయి.
ఈ నిధుల వినియోగంలో లెక్కా పత్రం చూపడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి కౌన్సిల్ ఆఫీసుకు వచ్చే నర్సులు, విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీరు, కూర్చునేందుకు కుర్చీలు, వాష్ రూమ్స్ లేని దుస్థితి నెలకొన్నది. నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇన్‌ఛార్జి పాలనలో నర్సింగ్ కౌన్సిల్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్న మహిళా అధికారి రెండు పోస్టుల్లో ఉన్నారని, అలాగైతే పాలనపై ఎలా దృష్టి సారిస్తారని నర్సింగ్ ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. టీచింగ్ క్యాడర్‌కు ప్రాధాన్యత ఇస్తూ.. క్లినికల్ నర్సులపై పెత్తనం చెలాయిస్తామంటే ఎలాగంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి నర్సింగ్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని నర్సింగ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు నర్సింగ్ కౌన్సిల్‌కు పూర్తిస్థాయి నర్సింగ్ రిజిస్ట్రార్‌ను నియమించాలని కోరుతున్నాయి.