హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ నెల 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ జీవో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
ఇందుకోసం వెంటనే చర్యలు చేపట్టాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. నియామక ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు తప్పకుండా పాటించాలని, లోకల్ క్యాడర్ వారీగా ఖాళీలను ప్రకటించాలని, రోస్టర్ పాయింట్లు పాటించాలని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఖాళీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 575, డ్రగ్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 11, ఆయూష్లో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలో 34, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో 3,235, తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 1,255, ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ సెంటర్లో 212 ఉద్యోగాలు ఉన్నట్టు వివరించారు.