కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక
ఓ వైపు కరువుతో కండ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నరు. మరోవైపు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు తండ్లాడుతున్నరు. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాసటనివ్వాల్సిన సర్కార్.. సదస్సుల పేరిట ఆర్భాటాలకు పోతున్నది.
- ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
- ఎండుతున్న పంటలు.. తాగునీటికి జనం తండ్లాట
- ప్రజాసమస్యలు పకనబెట్టి సదస్సులు, ప్రకటనలు
- మెస్సీ మ్యాచ్‌కు 100 కోట్లు.. ఐఆర్సీకి రూ.28 కోట్లు
- గ్లోబల్ సమ్మిట్‌కు 600 కోట్లు ఖర్చు చేసిన సర్కార్
- కరువులోనూ ఖేలో ఇండియా క్రీడా పోటీలకు సిద్ధం
- పథకాల ఆరంభ ప్రచార ఆర్భాటాలకు కోట్లల్లో ఖర్చు
ఓ వైపు కరువుతో కండ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నరు. మరోవైపు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు తండ్లాడుతున్నరు. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాసటనివ్వాల్సిన సర్కార్.. సదస్సుల పేరిట ఆర్భాటాలకు పోతున్నది. కరు వు నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి అంతర్జాతీయ సదస్సులు, ఆటల పోటీ లు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్నది.
గతంలో మెస్సీతో ఫుట్‌బాల్ ఆటకు రూ.100 కోట్లు తగలేసి.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సుకు రూ.28 కోట్లు ఖర్చుచేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నా.. గ్లోబల్ సమ్మిట్ కోసం రూ.600 కోట్ల దాకా దుబారా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తినా.. అవేవీ పట్టించుకోని రేవంత్ సర్కార్ తాజాగా భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్‌కు రూ.50 కోట్ల దాకా వెచ్చించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
తెలంగాణ ఇటు ఎండిన పంటలతో.. అటు మండి న గొంతులతో ఆర్తనాదాలు చేస్తున్నది. అన్ని రంగాల వారూ ఆగమై ‘అన్నమో రామచంద్రా’ అంటూ అరిగోస పడుతున్నా చెవికెక్కించుకోకుండా ‘ఈవెంట్ల’ హడావుడిలో మునిగితేలుతుండటం కాంగ్రెస్ సర్కార్కే చెల్లింది. ఇప్పుడు రాష్ర్టానికి కావాల్సింది సమ్మిట్లు.. సోకులు కాదు.. ఆదుకోవాల్సిన చేతులు!
హైదరాబాద్, నవంబర్ 12( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకున్నాయి. పంటలు ఎక్కడికక్కడ ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగు, తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. పట్టణాలు, నగరాల్లోనూ నీటి సరఫరా సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో కరువు నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ సదస్సులు, ఆటల పోటీలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లు కుమ్మరిస్తున్నది. ప్రజావసరాలకు నిధుల్లేవంటూ చేతులెత్తేస్తున్న పాలకులు.. ఈవెంట్ల నిర్వహణకు మాత్రం వేల కోట్లు వెచ్చించేందుకు వెనుకాడటమే లేదు.
గతంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహణకు రూ.100 కోట్ల వ్యయంపై విమర్శలు వెల్లువెత్తగా, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సు కోసం రూ.28 కోట్లు కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం రూ.600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఖేలో ఇండియా క్రీడాపోటీల నిర్వహణకు మరో భారీ వ్యయానికి సిద్ధమయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్‌కు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలు తెరపైకి వచ్చాయి. నిరుడు ఇదే కార్యక్రమానికి రూ.30 కోట్ల వరకు వెచ్చించినట్టు విమర్శలు వచ్చినా, ఈ సారి కరువు వచ్చినా, ఖర్చు మరింత పెరిగినా సర్కార్ వెనుకాడటమే లేదు. ఇలా వరుస ఈవెంట్లు, సదస్సులు, ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కరువు నివారణ, రైతుల సమస్యలు, కార్మికుల సంక్షేమం వంటి మౌలిక అంశాలను పట్టించుకోవడమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అల్లాడుతున్న ప్రజలు.. ఈవెంట్ల హడావుడిలో పాలకులు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సాధారణ వర్షపాతం నమోదుకాకపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భజలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. నీటిమట్టాలు పడిపోవడంతో మోటర్లు పనిచేయని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాగునీటి వనరులపై ఆధారపడిన రైతులు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పంటలు చేతికందే సమయంలో నీరు లేక ఎండిపోతుండటంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు తాగునీటి సరఫరా కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదురుచూస్తున్నారు. కరువు పరిస్థితులను ఎదురొనేందుకు తక్షణ కార్యాచరణ రూపొందించాల్సిన సమయంలో ప్రభుత్వం మాత్రం వరుస ఈవెంట్ల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన అధికారులు సదస్సులు, అతిథుల రాకపోకలు, ప్రొటోకాల్ ఏర్పాట్లలో బిజీగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
రైతులకు భరోసా కల్పించి పంట నష్టాన్ని అంచనా వేయడం, తాగునీటి సమస్యను పరిషరించడం, ప్రత్యామ్నాయ సాగునీటి ఏర్పాట్లు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, సాగునీటి కొరత నేపథ్యంలో పంటలు వేసుకోవద్దంటూ ప్రభుత్వం రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం, పంట నష్టపరిహారం, ఉపాధి హామీ పనుల కల్పన, పశువులకు మేత, తాగునీటి సరఫరాపై సమగ్ర ప్రణాళిక కనిపించడమే లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలకు అవసరమైన పనులకు నిధుల కొరత చూపుతున్న ప్రభుత్వం.. ప్రచార కార్యక్రమాలకు మాత్రం భారీ కేటాయింపులు చేస్తున్నదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
మెస్సీ మ్యాచ్‌కు రూ.100 కోట్లు?
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫుట్‌బాల్ ఈవెంట్‌కు భారీ ఖర్చు చేయడంపై విమర్శలకు కేంద్రంగా మారింది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ నిర్వహణ, ఏర్పాట్లు, ప్రచారం కోసం సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మనవడి కోసం, సన్నిహితుల కోసం మెస్సీతో ఫుట్‌బాల్ కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలేమిటన్న చర్చ కూడా జరిగింది. ఖర్చు చేసిన మొత్తం, స్పాన్సర్ల నుంచి వచ్చిన ఆదాయం, ప్రభుత్వ వాటా, కార్యక్రమం ద్వారా క్రీడారంగానికి కలిగిన ప్రయోజనాలపై సమగ్ర వివరాలు వెల్లడించకపోవడంతో సర్కార్ విమర్శలు పాలైంది.
చాపర్ అద్దె 11 నెలల్లో 111 కోట్లా?
ప్రభుత్వానికి సొంత అధికారిక హెలికాప్టర్ ఉన్నప్పటికీ, 11 నెలల పాటు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ నుంచి చాపర్‌ను లీజుకు తీసుకొని అద్దెల రూపంలో రూ.111 కోట్లు చెల్లించడం గమనార్హం. వీటికి అదనంగా రూ.100 కోట్ల లోపు ఉన్న చిన్న, మధ్యతరహా వ్యయాలను పరిశీలిస్తే, 40 మంది కార్పొరేషన్ చైర్మన్ల వాహనాలకు రూ.65 కోట్లు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ఫీజులకు రూ.45 కోట్లు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్ల మరమ్మతులు, లగ్జరీ ఇంటీరియర్స్‌కు రూ.35 కోట్లు, దావోస్, అమెరికా పర్యటనలకు రూ.30 కోట్లు, సలహాదారుల జీతభత్యాలకు రూ.25 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించడం గమనార్హం.
ఖజానాపై రూ.623.33 కోట్ల అదనపు భారం
ప్రభుత్వ భవనాల్లో, ఇతర నిర్మాణాలు, ప్రచార పనులకు కలిపి మొత్తంగా రూ.623.33 కోట్ల మేరకు ఖజానాపై అదనపు భారం పడినట్టు సమాచారం. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు రూ.13 కోట్లు, ప్రజాభవన్ రీమోడలింగ్‌కు రూ.12 కోట్లు, సీఎం కాన్వాయ్ కార్లకు రూ.10 కోట్లు, తెలంగాణ తల్లి విగ్రహాలకు రూ.9 కోట్లు, ఎంసీహెచ్ఆర్డీ గార్డెన్స్‌కు రూ.7 కోట్లు, గ్లోబల్ సమ్మిట్ ప్రచారానికి రూ.6 కోట్లు, సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహానికి రూ.5.33 కోట్లు, ఇతర క్యాంప్ ఆఫీసులు, మంత్రుల క్వార్టర్ల స్విమ్మింగ్ పూల్, ట్యాంక్‌బండ్ బాణసంచా, సచివాలయం గేటు మార్పు, ఇతర ప్రచార పనులకు కలిపి మొత్తంగా రూ.623.33 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.
ఐఆర్సీకి రూ.28 కోట్ల కేటాయింపు
నిధుల కొరత ఉన్నదని చెప్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణకు మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నదన్న విమర్శలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు మరో ఉదాహరణగా నిలిచింది. నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఐఆర్సీ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, నగర అలంకరణ, హోర్డింగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్ల వరకు కేటాయించిందన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాష్ట్రం ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏందన్న ప్రశ్నలు తలెత్తాయి. రహదారుల అభివృద్ధి, నిర్వహణ, గ్రామీణ రహదారుల మరమ్మతులు, ప్రమాదాల నివారణ వంటి అంశాలకు నిధుల అవసరం ఉన్న సమయంలో సదస్సు ఆర్భాటాల కోసం ఇంత మొత్తం వెచ్చించడం విమర్శలకు తావిస్తున్నది.
గ్లోబల్ సమ్మిట్ పేరిట రూ.600 కోట్లు
గత డిసెంబర్లో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కూడా ప్రభుత్వ భారీ వ్యయాల చర్చలో ప్రధానంగా నిలిచింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రకటించిన ఈ కార్యక్రమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు దేశ, విదేశాల్లో పర్యటించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ఖరీదైన హోటళ్లలో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.
ఫ్యూచర్‌సిటీలో భారీ విస్తీర్ణంలో వేదికలు, హంగులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎయిర్ షోలతో సమ్మిట్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఫ్యూచర్ సిటీలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హంగులు, ఆర్భాటాలు, ఎయిర్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రచారానికే రూ.600 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.
కరువు కాలంలోనూ ఖేలో ఇండియా హడావుడి
రాష్ట్రంలో కరువు పరిస్థితుల్లోనూ ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, రాష్ట్ర వాటాతో హైదరాబాద్‌తోపాటు మరో ఆరు నగరాల్లోని 20 వేదికల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అతిథుల బస కోసం వేలాది హోటల్ గదుల ఏర్పాట్లు, రవాణా, స్వాగత కమిటీలు, ఇతర సౌకర్యాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈవెంట్ నిర్వహణ కోసం వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు.
కరువు పరిస్థితుల్లో అత్యవసర ప్రజా అవసరాలను పకనబెట్టి ఇలాంటి ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా పంపిణీ కంటే ప్రచార ఆర్భాటాలకే ఎకువ ఖర్చు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్, ఖమ్మం, కొడంగల్ వంటి ప్రాంతాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు, రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సుల అద్దెలు, జర్మన్ టెంట్లు, దినపత్రికల ప్రకటనలు, టీవీ వీడియోలకు కలిపి రూ.520 కోట్లు ఖర్చు చేశారని గణాంకాలు చెప్తున్నాయి.
పైసల్లేవంటూనే.. కోట్ల ఖర్చులు
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఒకవైపు నిధుల్లేవంటూనే ఆర్భాటపు ఖర్చులే సుమారు రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుననారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నదని, గత పాలకులు ఖజానాను ఖాళీ చేశారని సీఎం, మంత్రులు పలుమార్లు ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఉద్యోగుల ప్రయోజనాలకు నిధుల కొరత ఉన్నదని చెప్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లోనూ ఆర్థిక పరిమితుల ప్రస్తావన వస్తున్నది. కొన్ని పథకాల లబ్ధిదారులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారని, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు తమ సమస్యల పరిషారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సదస్సులు, క్రీడా పోటీలు, ప్రచార కార్యక్రమాల కోసం మాత్రం రూ.వందలాది కోట్లు వెచ్చిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ సమ్మిట్‌కు మరో రూ.50 కోట్లు
ఇదే వరుసలో ఇప్పుడు భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్ నిర్వహణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. నవంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. దేశంలోని కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.
విదేశీ ప్రతినిధుల విమాన టికెట్లు, స్టార్ హోటళ్లలో బస, భోజనాలు, రవాణా, ఇతర ఆతిథ్య ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఒకో ప్రతినిధికి కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు వ్యయం అవుతున్నట్టు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో ముందుగానే గదులు బుక్ చేసినట్టు తెలుస్తున్నది. ట్రాన్స్‌పోర్టు శాఖ నుంచి 400 కార్లు, 100 ఏసీ బస్సులు సమకూర్చినట్టు సమాచారం.
సింగరేణి కార్మికుల శ్రమ ధారాదత్తం
కార్మికుల శ్రమతో నడిచే సింగరేణి సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత, అభివృద్ధి నిధుల నుంచి హైదరాబాద్‌లో నిర్వహించిన క్రీడా వేడుకలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు రూ.500 కోట్లను తరలించడంపై కార్మిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ప్రతి కుటుంబానికీ డిజిటల్ గుర్తింపు కార్డులు, హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామంటూ వైద్యారోగ్య, ప్రణాళిక శాఖల ద్వారా రూ.450 కోట్లను ప్రైవేట్ ఐటీ సంస్థలకు విడుదల చేయడంపైనా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ పథకాలను పక రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మహారాష్ట్ర, జార్ఖండ్ , కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక దినపత్రికలు, జాతీయ టీవీ చానళ్లలో ఫుల్ పేజీ ప్రకటనల కోసం రాష్ట్ర ప్రజల పన్నుల సొమ్ము రూ.300 కోట్లను ఖర్చు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలనను పకనబెట్టి సీఎం, మంత్రులు 75 సార్లు ఢిల్లీకి వెళ్లిన పర్యటనల కోసం ప్రత్యేక చార్టర్డ్ జెట్లు, ప్రొటోకాల్ వాహనాలు, లగ్జరీ హోటళ్ల బస పేరిట రూ.280 కోట్ల వ్యయం నమోదైందని, ప్రజాపాలన దరఖాస్తుల ముద్రణ, డాటా ఎంట్రీకి ప్రైవేట్ ఏజెన్సీలకు మరో రూ.280 కోట్లు చెల్లించారని సమాచారం
ప్రజా సమస్యలు పక్కనబెట్టిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు, క్రీడా అభివృద్ధి అవసరమే. అయితే వీటి పేరుతో జరుగుతున్న ఖర్చులకు ప్రాధాన్యతాక్రమం ఉండాలి. కరువు నివారణ, తాగునీటి సరఫరా, రైతులకు పంట నష్టపరిహారం, కార్మికుల సంక్షేమం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు నిధులు అందుబాటులో ఉంచిన తర్వాతే ప్రచార కార్యక్రమాలపై వ్యయాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలు పరిషారం కాకుండా ఈవెంట్ల నిర్వహణకే అధికార యంత్రాంగం పరిమితమవుతున్నదన్న భావన బలపడుతున్నది.
గత ఏడాది నుంచి ఇప్పటివరకు వివిధ కార్యక్రమాల కోసం చేసిన ఖర్చులు, వాటి ద్వారా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలపై ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరువు పరిస్థితులను ఎదురొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రచార ఆర్భాటాల కంటే ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని రైతు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 365 మండలాల్లో కరువు పరిస్థితులు దాపురించి ప్రజలు అల్లాడుతుంటే.. కేవలం 400 మంది వీఐపీ ప్రతినిధుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి విలాసవంతమైన సదస్సును నిర్వహించేందుకు సర్కార్ సిద్ధపడటంపై రాష్ట్ర ప్రజానీకం విస్మయం వ్యక్తంచేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

