త్యాగాల తెలంగాణను కాపాడుకుందాం
కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఆ అబద్ధాల పునాదులపై ఆరు గ్యారెంటీలు అనే కొత్త హామీ పుట్టుకొచ్చింది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఢిల్లీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు హామీలు గుప్పించారు.
విమర్శ వేరు, దూషణ వేరు. పదేండ్లలో కొందరు ఆ హద్దు దాటారు. విధానాల మీద కాకుండా ఒక మనిషి మీద, ఆయన కుటుంబం మీద సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వ్యక్తిగత దూషణలు రోజూ వినిపించాయి. ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుడిని తిట్టడమే కొందరికి పనిగా మారింది. కానీ కేసీఆర్ సహనం ఆయన గొప్పతనం. అబద్ధం వందసార్లు చెప్తే కొందరికి నిజంలా వినిపించింది. ఆ ఫలితమే నేటి దయనీయ పరిస్థితి.
కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఆ అబద్ధాల పునాదులపై ఆరు గ్యారెంటీలు అనే కొత్త హామీ పుట్టుకొచ్చింది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఢిల్లీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికారు. ప్రియాంక గాంధీ ఆ హామీలనే ఊదరగొట్టారు. 1956లో మోసపోయినట్టు, 2004లో నమ్మినట్టు, 2009లో వంచనకు గురైనట్టు, 2023 డిసెంబర్లో కూడా భారీ మోసం జరిగింది. ప్రజలు కొందరు నమ్మారు. స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారం మారింది. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పుడు ఆ గ్యారెంటీలు అటకెక్కాయి. మహిళలకు నెలకు రూ.2,500 అన్నారు, ఇంకా అందలేదు. వృద్ధులకు రూ.4,000 పింఛన్ అన్నారు, ఇంకా పెరుగలేదు. చదువుకునే పిల్లలకు రూ.5 లక్షల విద్యా భరోసా అన్నారు, అది కాగితం మీదే ఉన్నది. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. రైతు భరోసా ఎకరానికి రూ.15,000 అన్నారు, రూ.12,000కే పరిమితమైంది. ఈ యాసంగికి అదైనా ఇస్తారో లేదో ప్రభుత్వం ఇంకా తేల్చలేదు.
ఉచిత బస్సు గందరగోళంగా మారింది. బస్సులు పెంచకుండా మహిళలకు ఉచిత ప్రయాణం అనడంతో బస్సుల్లో రద్దీ పెరిగి నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. లక్షల మంది రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. తెలంగాణలో ఇచ్చిన మాటలను నెరవేర్చని కాంగ్రెస్ నేతలు, ఇతర రాష్ర్టాల ఎన్నికల్లోనూ ఇంతకంటే పెద్ద హామీలు గుప్పించారు. ముందు ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, ఎవరైనా ఆ మాటను నమ్ముతారు.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో సభలు నిర్వహించిన సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పుడు కనిపించడంలేదు. తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకున్నది. ఓట్ల కోసం చూపించిన ఆరాటం ప్రజల కష్టాలను తీర్చడంలో ఎందుకు చూపించడంలేదు?
కాంగ్రెస్ ముందుచూపు లేని పాలన వల్ల ఇప్పుడు అసలు కష్టం వచ్చింది. 2026 జూన్‌లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లక్షల క్యూసెక్కుల గోదావరి నీళ్లు కిందికి పోతుంటే, పాలకులు పంపులు ఆన్ చేయలేదు. బీఆర్ఎస్ నేతలు ఉద్యమాలు చేసినా సర్కార్ పెద్దలు స్పందించలేదు. అప్పుడు నీళ్లు ఎత్తకుండా చోద్యం చూసి, ఇప్పుడు ‘వచ్చే సీజన్లో సాగుకు నీళ్లు ఉండవు, వరి పంట వేయకండి. డబ్బు ఎక్కడి నుంచైనా తేవచ్చు, నీళ్లను కొనలేం’ అంటున్నారు. మరి కొనలేని నీళ్లు మన ముందునుంచే పోతుంటే, ఎందుకు ఎత్తిపోయలేదు? దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొలాలకు కరెంటు సక్రమంగా వస్తలేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రి సొంత ఊరి దగ్గరే, శ్రీశైలం హైవే మీద రైతులు రాస్తారోకో చేశారు. ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కరెంటు ఉత్పత్తి ఎందుకు పెంచలేదని ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కానీ అధికారులను నడిపించేది ఎవరు? పాలకుడే ఈ ప్రశ్న అడుగుతుంటే, ప్రజలు ఎవరిని అడగాలి? ఎల్ నినో గురించి నెలల ముందే హెచ్చరికలు వచ్చాయి. తెలిసీ ఎందుకు సిద్ధం కాలేదు? అని ప్రజలు నిలదీస్తే ముఖ్యమంత్రి వద్ద సమాధానం ఉన్నదా?
కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం, సాయం గురించి మాత్రం భరోసా ఇవ్వలేదు. కేంద్ర సాయం వచ్చాకే ఇస్తామని బాధ్యత నుంచి తప్పుకొన్నది. నిరుడు అకాల వర్షాల పరిహారమే ఇంకా రైతులకు అందలేదు. ముఖ్రా(కే) గ్రామ రైతులు ఎండిన పత్తి మొక్కలు పట్టుకుని సెల్ఫీలు దిగి రాహుల్ గాంధీకి పంపారు. ఆ ఫొటోలు ఢిల్లీ వరకు చేరాయి. జవాబు మాత్రం ఇంకా రాలేదు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కష్ట కాలంలో కేంద్రం నుంచి సాయం త్వరగా తేవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. రాజకీయాలు పక్కన పెట్టి ఢిల్లీలో తెలంగాణ రైతు గొంతుకై నిలువాలి. కేసీఆర్ మీద చించుకుని మాట్లాడిన గొంతులు, ఈ రోజు గ్యారెంటీలు అమలు కానప్పుడు, రైతు పొలం ఎండిపోతున్నప్పుడు ఎందుకు మూగబోయాయి? వాళ్ల ఆవేశం ప్రజల కోసమా, లేక ఒక్క మనిషిని అధికారం నుంచి దించడం కోసమేనా? ఈ మౌనానికి మూల్యం చెల్లిస్తున్నది ఎండిన పొలం దగ్గర నిలబడ్డ రైతు, పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అవ్వ, తాత, రూ.2,500 కోసం ఎదురుచూస్తున్న ఆడబిడ్డలు, ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు. తుక్కుగూడ వేదిక మీద ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ఆ వేదిక సాక్షిగానే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి.
రాష్ట్ర నలుమూలలా, దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా ఒకటే గుర్తుంచుకోవాలి. మీ ఊరికి ఒక ఫోన్ చేయండి. మూడేండ్లలో ఏం జరిగిందో నిజాలను మీ వాళ్లకు చెప్పండి. యువతా.. ఇది మీ రేపటి భవిష్యత్తు. మీ ఇంట్లో చదువలేని పెద్దలకు ఈ మాటలు చదివి వినిపించండి. ఓట్ల కోసం మీ ఊరికి వచ్చే నేతలందరినీ మర్యాదగానే అయినా గట్టిగానే నిలదీయండి. ఇచ్చిన మాట ఏమైంది? అని అడగండి. తెలంగాణ ఉద్యమం మనకు నేర్పిన దారి అదే.
తెలంగాణలో రైతు మళ్లీ రాత్రంతా బావి దగ్గర పడుకోవాల్సి వస్తే, అది త్యాగాల తెలంగాణకు అవమానం. రాష్ట్రం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుడికి, పోరాడిన ప్రజలకు రాష్ట్రం మళ్లీ కష్టంలో ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఊహించగలం. కల కన్నాం.. కేసీఆర్ నాయకత్వంలో సాకారం చేసుకున్నాం. సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైన తెలంగాణను తొమ్మిదిన్నరేండ్లలో తొవ్వకు తెచ్చుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆగమైపోతున్నప్పుడు కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణ రాష్ట్రం మనకు ఎవరో ఇచ్చిన కానుక కాదు, కొట్లాడి సాధించుకున్న హక్కు. ఆ హక్కును కాపాడుకోవాల్సింది కూడా మనమే. జై తెలంగాణ.
కల్వకుంట్ల శ్రీనివాస్‌రావు
9963554419
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

