కాళేశ్వరాన్ని వినియోగంలోకి తెస్తం
కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు.. అది పనికే రాదన్నారు.. కొట్టుకుపోయిందన్నారు.. నీళ్లు ఎత్తిపోసే అవకాశమే లేదన్నారు.. ఇప్పుడు ఆ కాళేశ్వరమే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కుగా మారింది.
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సీఎం రేవంత్ ఆదేశాలు
- డిసెంబర్లో మరమ్మతులు ప్రారంభం
- క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం
- కాళేశ్వరంపై చర్చకు ప్రత్యేకంగా అసెంబ్లీ
- రెండు లేదా మూడు రోజులు నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు.. అది పనికే రాదన్నారు.. కొట్టుకుపోయిందన్నారు.. నీళ్లు ఎత్తిపోసే అవకాశమే లేదన్నారు.. ఇప్పుడు ఆ కాళేశ్వరమే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కుగా మారింది. కరువు కమ్ముకొస్తున్న తరుణంలో కాళేశ్వరం విలువ తెలిసొచ్చింది. ఓవైపు సాగు, తాగునీటి గోస, మరోవైపు సర్కార్‌పై మండిపడుతున్న రైతులు.. ఇక గత్యంతరం లేక కాళేశ్వరం శరణుజొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కూలిపోయింది, పనికిరాదన్న కాళేశ్వరం ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తెస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం పునరుద్ధరణపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను వేగవంతం చేయాలని సూచించారు. బరాజ్‌ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టంచేశారు. అవసరమైన అనుమతులను త్వరగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
డిసెంబర్లో పనులు ప్రారంభించాలి
మేడిగడ్డ బరాజ్ దెబ్బతిన్న తర్వాత మూడు బరాజ్‌ల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్టు అధికారులు వివరించారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్టు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వివరించారు. మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు.
నిర్మాణ లోపాలకు సంబంధించిన మరమ్మతుల వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల ఖర్చును ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్టు వివరించారు. పనుల్లో జాప్యం జరుగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని సీఎం సూచించారు. పునరుద్ధరణకు సంబంధించిన తుది అనుమతులను ఈ నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని చెప్పారు. బరాజ్‌ల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులతో పాటు రక్షణ పనులను రెండు దశలుగా విభజించుకోవాలని చెప్పారు.
కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ
కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. రెండు లేదా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి సూచించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

