రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ఎత్తిపోతలు, మరమ్మతులు, నిర్వహణ, వినియోగం, నాణ్యత తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ),కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) స్పష్టత ఇచ్చిన అంశాలతో తీవ్ర ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ సర్కార్..
- నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్… ముచ్చటగా మూడోసారీ మొట్టికాయలు
- నిపుణులు లేవనెత్తిన సందేహాలకు బదులివ్వని రాష్ట్ర అధికారులు?
- సాంకేతిక పరీక్షలు, వాటి ఫలితాలు, పనుల డిజైన్లు, యాక్షన్ప్లాన్పై చర్చ
- అస్పష్టతతోనే ముగిసిన సమావేశం
- మళ్లీ పక్కా సమాచారం, కార్యాచరణ ప్రణాళికతో రావాలని కమిటీ సూచన
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ఎత్తిపోతలు, మరమ్మతులు, నిర్వహణ, వినియోగం, నాణ్యత తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ),కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) స్పష్టత ఇచ్చిన అంశాలతో తీవ్ర ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ సర్కార్.. తాజాగా కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ అంశాలపై సాంకేతిక కమిటీ కురిపించిన ప్రశ్నలకు సమాధానమివ్వలేక తెల్లమొఖం వేసింది. నిపుణులు లేవనెత్తిన సందేహాలకు రాష్ట్ర అధికారులు బదులివ్వలేదని సమాచారం. దీంతో ఏవిధమైన స్పష్టతరాకుండానే సమావేశం ముగిసిందని తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలు చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేకంగా టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ (టీవోసీ)ని నియమించిన విషయం తెలిసిందే.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ సమీర్‌కుమార్ శుక్లా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలో బుధవారం సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూఆర్ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), డిజైనర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఎఫ్ఆర్వై హైడ్రో ప్రతినిధులు పాల్గొన్నారు. బరాజ్‌ల నాణ్యతకు సంబంధించి సాంకేతిక పరీక్షలు, వాటి ఫలితాలు, పనులకు సంబంధించి డిజైన్లు, యాక్షన్‌ప్లాన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు సీకెంట్‌పైల్స్ స్థానంలో ఆర్సీసీ డయాఫ్రమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని సమాచారం. ఓవర్‌సైట్ కమిటీలోని నిపుణులు, చైర్మన్ తెలంగాణ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని విశ్వసనీయ సమాచారం. పునరుద్ధరణ పనుల కార్యాచరణ ప్రణాళిక, రూపొందించిన డిజైన్లు, నిర్దేశించుకున్న గడువులు ఏమిటి? తదితర అంశాలపై ప్రత్యేకంగా ప్రశ్నించారని తెలిసింది.
అయితే, ఏ ఒక్క ప్రశ్నకూ రాష్ట్ర అధికారులు స్పష్టమైన సమాధానమివ్వకుండా తెల్లమొఖం వేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో లేవనెత్తిన అంశాలపై పక్కా సమాచారం, కార్యాచరణ ప్రణాళికతో రావాలని కమిటీ ఈ సందర్భంగా సూచించిందని తెలిసింది. కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం, ప్రాజెక్టు మరమ్మతులు, ప్రాజెక్టు నిర్వహణ తమ పరిధిలోని అంశం కాదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటికే ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చింది. తమది సలహా మాత్రమేనని, నిర్ణయాలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తేల్చిచెప్పింది. హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అటు సీడబ్ల్యూసీ కూడా తాము సాంకేతిక అంశాలను మాత్రమే పరిశీలిస్తామని, ప్రాజెక్టులను వినియోగించుకోవాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాల్సిన అంశమని స్పష్టంచేసింది. ఇటు సీడబ్ల్యూపీఆర్ఎస్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు లేవని తెలిపింది. ఒక్క ఏడవ బ్లాక్ తప్ప మిగతావన్నీ పరఫెక్ట్‌గా ఉన్నాయని తేల్చి చెప్పడం గమనార్హం. ఇటీవల కాలంలో ఈ మూడు సంస్థలు తేల్చి చెప్పిన అంశాలతో తీవ్ర ఇరకాటంలో పడిన సర్కార్‌ను.. తాజాగా సాంకేతిక కమిటీ కురిపించిన ప్రశ్నలు మరింత ఉక్కిరిబిక్కిరికి గురిచేసేలా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

