హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో సుమారు 1,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉండనున్నాయి. ఇప్పటికే ఏర్పాటైన మెడికల్ కాలేజీలతోపాటు, ఈ ఏడాది ప్రారంభించబోయే కాలేజీల్లోనూ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తున్నది.