కాళేశ్వరం/మహదేవపూర్, మార్చి 11: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లు అత్యద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు నిర్మించి సాగు నీటికి వినియోగిస్తున్న తీరును కొనియాడింది. తమిళనాడుకు చెందిన 20 మంది నీటి పారుదల శాఖ ఇంజినీర్లు శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ బరాజ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బరాజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆయా బరాజుల్లోని వ్యూపాయింట్ వద్దకు చేరుకొని నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. బరాజ్‌ల ఆవశ్యకత తదితర వివరాలను సంబంధిత ఇంజినీర్ అధికారులను అడిగి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బరాజ్‌లను సందర్శించడం ఆనందంగా ఉన్నదని, తమ రాష్ట్రంలో ఇలాంటివి నిర్మించేందుకు స్వయంగా పరిశీలనకు వచ్చినట్టు వారు పేర్కొన్నారు. వారి వెంట ఇరిగేషన్ డీఈఈ సతీశ్, ఏఈఈ యాకయ్య, డీఈ సురేశ్, జేఈ వలీ, శ్రవణ్, భరత్ ఉన్నారు.