హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సరిగ్గా చదువలేదనే బాధ.. ఫెయిల్ అవుతామన్న ఆందోళన.. తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం.. స్నేహితులు, బంధువుల్లో చులకన అవుతామన్న ఆత్మన్యూనత.. ఇలాంటి మానసిక ఒత్తడితో సతమతమయ్యే విద్యార్థులు టెలిమానస్ కౌన్సెలింగ్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఇంటర్‌బోర్డు చొరవతో వైద్యారోగ్య శాఖ ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నది. ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా ఉన్నప్పుడు నవీన్‌మిట్టల్ ప్రత్యేక చొరవ తీసుకొని, ఆ శాఖ అధికారులతో చర్చించి ఈ సేవలను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలతో విద్యార్థులు ఉపశమనం పొంది, భయాన్ని పోగొట్టుకొని ధృడ స్వభావంతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఇలాంటి వారికి ఈ టెలిమానస్ చక్కటి వేదికగా సేవలందిస్తున్నది.
టెలిమానస్ కాల్‌సెంటర్ సేవలను 24 గంటల పాటు ఉచితంగా అందిస్తారు. ఈ కాల్‌సెంటర్‌ను రోజుకు 50 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఫోన్లో సంప్రదిస్తున్నారని తెలిపింది. కొంతమంది తమ వద్ద ఫోన్లు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చినప్పుడు వారి ఫోన్ల నుంచి తమకు కాల్స్ చేస్తున్నట్టుగా టెలికాలర్స్ వివరించారు. తీవ్ర నిరాశ, ఒత్తిడి, చదివింది గుర్తుండకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు తమను ఆశ్రయిస్తున్నట్టు టెలిమానస్ కౌన్సిలర్లు చెప్తున్నారు. అత్యధికులు ఫెయిలవుతామన్న ఆందోళనతోనే ఫోన్లు చేస్తున్నారని, అతిగా ఊహించుకుంటున్నారని వారు తెలిపారు. తల్లిదండ్రులు, లెక్చరర్లు, యాజమాన్యాల నుంచి పెరుగుతున్న ఒత్తిడే కారణమని వారంటున్నారు.
విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు మానసిక వైద్యులు తగు సూచనలు ఇస్తున్నారు. ఉ దయం లేవగానే చదువడం ఉత్తమం. నిరంత రం చదువకుండా 45 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. నిరంతరం చదివితే కొన్ని అంశాలు గుర్తుండవు. అన్నీ చదివిన తర్వాత మనసులో పునశ్చరణ చేసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. తలనొప్పిని దూ రం చేసుకునేందుకు, ఏకాగ్రత కోసం ధ్యానం, యోగా చేయాలి. రిలాక్స్ అయ్యేందుకు కొద్దిసేపు ఫ్రెండ్స్‌తో బయటికెళ్లాలి.. ఉదయం చదివింది రాత్రి రివిజన్ చేసుకోవాలి.. అంటూ మానసిక వైద్యులు సూచించారు.
విద్యార్థి : హలో మేడం.. ఎగ్జామ్స్ అంటే భయమేస్తున్నది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి?
మానసిక వైద్యురాలు : ఫెయిలైతే ఏమవుతుంది చిన్నా.. జీవితం పోయినట్టు కాదుగా. మార్చిలో ఫెయిలైతే.. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంది. లేదంటే వచ్చే మార్చిలో వార్షిక పరీక్షలు. శ్రీనివాసరామానుజన్ కూడా చదువులో ఫెయిలయ్యారు. ముందు పరీక్షలకెళ్లు. ప్రశ్నలు చూసి నీకు తెలిసింది రాయి. ఫెయిల్ అవుతావా.. లేదా అన్నది తర్వాత తేలుతుంది. ఇంత చిన్నవాటికే పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిదికాదు.
విద్యార్థి : ఓకే మేడమ్ థ్యాంక్యూ..
ఇదీ ఓ ఇంటర్ విద్యార్థి 14416 (టెలిమానస్) కాల్సెంటర్లో ఉండే మానసిక వైద్యురాలి మధ్య జరిగిన సంభాషణ. ఇలా కాల్చేసిన వారికి కౌన్సెలింగ్ ద్వారా అండగా ఉంటూ.. ఉపశమనం కలిగిస్తున్నారు.
విద్యార్థుల ప్రశ్నలకు కౌన్సిలర్ల సమాధానాలు
మేడం.. ఎగ్జామ్ అంటే భయమేస్తోంది. అసలు రాయగలనా? లేదా? టెన్షన్‌తో చచ్చిపోతున్నా. ఏం చేయాలి చెప్పండి.. అని ఓ విద్యార్థి కాల్. మేడం నాకు చదివింది గుర్తుండటం లేదు.. తలనొస్తుంది.. అని మరో విద్యార్థి బాధ చెప్పుకున్నాడు. బిర్యాని తింటే ఇబ్బంది అయింది.. ఆరోగ్యం బాగాలేదు.. అని ఇంకో విద్యార్థి టెలిమానస్ను ఆశ్రయించారు. వీటితో పాటు పలువురు విద్యార్థుల అనుమానాలకు అక్కడి టెలికాలర్స్ తగు సూచనలు, సలహాలు ఇస్తూ విద్యార్థుల్లో భయాన్ని తొలగిస్తున్నారు.