మేడిపల్లి, డిసెంబర్ 3: సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ కుడి కాలువ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేది లేదని జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం, దేశాయిపేట, రాజలింగంపేట రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. కథలాపూర్ మండలం సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ కుడి కాలువ నిర్మాణం కోసం గోవిందారం రెవెన్యూ పరిధిలో భూసేకరణకు వారం క్రితం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, మంగళవారం తహసీల్దార్ రవికిరణ్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు సంతకాలు చేయకుండా బహిష్కరించారు. భూ సేకరణను నిలిపేసి, ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కుడికాలువ భూ సేకరణతో చిన్న, సన్నకారు రైతులకు జీవనాధారమైన భూములు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువను నిండుగా మార్చి చెరువులను నింపుతామని మాజీ సర్పంచ్ కాటిపల్లి శ్రీపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారని, ఆ మేరకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సర్వే చేయించారని గుర్తు చేశారు. కుడి కాలువ భూసేరకరణ నిలిపివేసి, కేసీఆర్ సర్కారు చేసిన సర్వే ప్రకారం చెరువులను నింపాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కరండ్ల మధుకర్, నాంచారి స్వప్న, రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, నాయకుడు అన్నాడి జలపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.