హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): వీబీజీ రామ్ జీ చట్టం- 2025 రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హకులను హరించే విధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వీబీజీ రామ్ జీ చట్టం- 2025 ప్రభావాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామీణ పేదల ఉపాధి హకు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం చూపే ఈ చట్టంలోని నిబంధనలను న్యాయపరంగా, రాజ్యాంగపరంగా వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. వీబీజీ రామ్ జీ చట్టానికి సంబంధించి రూపొందించిన సిఫార్సులను జూలై 2తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, నిపుణులు చట్టంలోని వివిధ అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.