హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : నేడు మేడారంలో జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి, వారికి శుభవార్త చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిన ఆర్టీసీ కార్మిక సమస్యల పరిషారం కోసం మంత్రివర్గ సమావేశంలో మంత్రులంతా సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ డిమాండ్లలో ప్రధానమైన.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 2021 పేసేల్ అమలు వంటివి ఉన్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే డిమాండ్లను చర్చించి పరిషరించాలని డిమాండ్‌చేశారు.
20న ఆర్టీసీ యూనియన్ల ‘పోరాట దినం’; ఎర్రబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనండి కార్మికులకు సంఘాల నేతల పిలుపు
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌తో యూనియన్లు ఉద్యమం ఉధృతం చేశాయి. ఇప్పటికే పోరుబాట పట్టి, వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టిన కార్మిక సంఘాలు.. ఈ నెల 20న ‘పోరాట దినం’గా పాటించాలని నిర్ణయించాయి. మంగళవారం కార్మికులంతా ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో పనిచేసే అన్ని క్యాటగిరీల కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.