కొండాపూర్, మార్చి 22: ‘పిట్ట కొంచెం-కూత ఘనం’ అనే సామెత హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన పిల్లి సిద్ధార్థ్ అనే 14 ఏండ్ల బాలుడికి సరిగ్గా సరిపోతుంది. చదువుతున్నది తొమ్మిదో తరగతే అయినా సాఫ్ట్వేర్ కోడింగ్‌లో సిద్ధార్థ్ అసామాన్య ప్రతిభను కనబరుస్తుండటమే ఇందుకు కారణం. చిన్నప్పటి నుంచే సెల్ఫోన్లో గేమ్‌లను, ఇతర అప్లికేషన్లను చూస్తూ పెరిగిన సిద్ధార్థ్.. 7వ ఏటనే కోడింగ్ వైపు అడుగులు వేశాడు. తల్లిదండ్రులు రాజ్‌కుమార్, ప్రియ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడం ఆ బాలుడికి మరింత కలిసొచ్చింది. వారు అందించిన ప్రత్యేక శిక్షణతో ఇప్పటికే పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, సీ లాంగ్వేజ్, ఎస్‌క్యూఎల్ తదితర కంప్యూటర్ భాషల్లో రాటుదేలిన సిద్ధార్థ్.. ఎక్స్‌ప్లోరేటరీ డాటా అనాలిసిస్ (ఈడీఏ)నిపుణుడిగా ఎదిగి, మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లను సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘ఇన్ఫినిటీ లెర్నింగ్’ అనే సాఫ్ట్వేర్ సంస్థలో రూ.30 వేల జీతానికి డాటా సైంటిస్ట్‌గా సేవలు అందిస్తున్న సిద్ధార్థ్.. ఇటీవల బైజూస్ యంగ్ జీనియస్ సీజన్ -2 షోలో సిద్ధార్థ్ బాల ప్రతిభావంతుడిగా అవార్డును సైతం కైవసం చేసుకోవడం విశేషం.
ఏఐ సొల్యూషన్స్ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం టీహబ్ నుంచి సలహాలు, సూచనలు తీసుకొంటా. ప్రభుత్వంతోపాటు అమ్మానాన్నల ప్రోత్సాహంతో ముందుకుసాగి మరిన్ని విజయాలు సాధిస్తా.
– సిద్ధార్థ్