హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్టు కంపెనీ సీఎండీ డా.బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు. నిరుడు 287.6 లక్షల టన్నులతో పోలిస్తే 4 శాతం వృద్ధి నమోదైందన్నారు. అలాగే గత ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 159.1 లక్షల టన్నుల నుంచి 198.2లక్షల టన్నులకు పెంచినట్టు ఆయన వివరించారు.
ఎల్నినో పరిస్థితుల కారణంగా సింగరేణి సంస్థ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేయాలని విద్యుత్ సంస్థలతో సమన్వయం జరుపుతూ.. విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గును శక్తి మేర సరఫరా చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని, రవాణాను పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 620 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు 650 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.