హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇదే సమయం లో అన్ని జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేప పిల్లల ను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 26,778 చెరువుల్లో రూ.68 కోట్ల వ్యయంతో 88.52 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రూ.25 కోట్లతో 10 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేయనున్నారు. మొత్తంగా రూ.93 కోట్ల వ్యయంతో 98.52 కోట్ల చేప, రొయ్య పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏయే జిల్లాకు ఎన్ని చేప పిల్లలు అవసరం? ఎక్కడి నుంచి వాటిని సరఫరా చేయాలి? అనేదానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. చేప పిల్లల రవాణా చేసే వాహనాలను జీపీఎస్‌కు అనుసంధానించి ట్రాక్ చేయనున్నారు. చేప పిల్లల సంఖ్య పక్కాగా ఉండేలా కౌంటింగ్ మిషన్లను కూడా సిద్ధం చేస్తున్నారు.
337 కోట్ల చేప పిల్లల పంపిణీ
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2016-17లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత ఏడాది వరకు రూ.286 కోట్ల ఖర్చుతో రూ.338 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు రూ.20 కోట్లతో 44 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. చేప పిల్లల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. 27 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
