హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే వరకు గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్సీ సామజికవర్గాల నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. త్వరలో జరగబోయే గ్రూప్-3లో 1,380పైచిలుకు పోస్టులు, గ్రూప్-2లో 783 పోస్టుల పరీక్షలను ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు వాయిదా వేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణను తక్షణమే అమలు చేస్తామని, గ్రూప్స్ పోస్టుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. దీంతో పరీక్షలను వాయిదా వేసి ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం భవిష్యత్‌లో ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రూప్-2ను నాలుగుసార్లు వాయిదా వేసినందున ఇతర వర్గాల అభ్యర్థులు వ్యతిరేకించే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే ఈ నోటిఫికేషన్లలోనే అదనపు పోస్టులు కలిపి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ఇటీవల భర్తీ చేసిన ఏఈఈ, ఏఈ, డీఎస్సీలో వర్గీకరణ అమలు చేయలేనందునా, కనీసం గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లోనైనా న్యాయం చేయాలని విన్నవించారు. జాతీయ కమిషన్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్‌కు లేఖలు రాశామని ఎస్సీ విద్యార్థులు వెల్లడించారు.