కాంగ్రెస్ నేత భూమేత.. దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
టీజీఐఐసీని అడ్డుపెట్టుకొని అధికార కాంగ్రెస్ నేతలు సంగారెడ్డి జిల్లాలో దళిత బహుజనుల భూములను చెరబట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
- కోట్ల విలువైన భూమి అగ్గువకే జాతీయ నేత కంపెనీకి
- కొత్లాపూర్‌లో టీజీఐఐసీ ముసుగులో అసైన్డ్ ఆరగింత
- మరో 10.5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకూ యత్నం
- సంగారెడ్డి కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు
- ‘నమస్తే తెలంగాణ’ కథనంతో వెలుగులోకి భూదందా
అది జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న భూమి. ఎప్పుడో 40 ఏండ్ల కింద ఇందిరాగాంధీ హయాంలో అసైన్ చేసింది. అప్పటినుంచి ఓ కుటుంబం ఆ భూమి మీదనే బతుకుతున్నది. ఇప్పుడు దాని విలువ రూ.30కోట్ల పైమాటే. కానీ అదే భూమిపై కాంగ్రెస్ నేత కన్నుపడ్డది. ‘రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా?.. వెంటనే అసైనీ పట్టాదారుని పిలిపించాడు. బతిమిలాడారు.. ఆశపెట్టారు.. బెదిరించారు.. కానీ ఆ రైతు వినలేదు. ‘మా తాత మా నాయినకు ఇచ్చిండు. మా నాయిన నాకు ఇచ్చిండు. ఈ భూమే నాకు ఆధారం. డబ్బుకైతే ఇవ్వను. నన్ను నా పిల్లలను చంపి భూమి తీసుకోండి’ అని తేల్చి చెప్పిండు.
వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చారు. భూమి మీద మీకు హక్కులు లేవు అని దబాయించారు. వారి వెనుక పోలీసులు వచ్చారు.. భూమిలోకి పోతే ఇంటిల్లిపాదినీ అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. ఆఖరికి అతన్ని బంధించి పంట భూమిని ఆధీనంలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత చేతికి అప్పగించారు. ఇంత భూమిలో ఆయన బీరు సీసాలు కడుగుతారట. ఈ 6 ఎకరాలకు తోడుగా మరో 10.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని మొత్తం 16.5 ఎకరాల భూమిని కబ్జాపెట్టారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఇదంతా ఎక్కడో కాదు.. మన రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్లోనే.
హైదరాబాద్/సంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : టీజీఐఐసీని అడ్డుపెట్టుకొని అధికార కాంగ్రెస్ నేతలు సంగారెడ్డి జిల్లాలో దళిత బహుజనుల భూములను చెరబట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధి పేరుతో స్వయంగా ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీ నిరుపేద రైతుల భూములను గుంజుకొని కాంగ్రెస్ జాతీయ నేత కుటుంబానికి చెందిన జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌కు కారుచౌకగా కట్టబెట్టింది. ఏండ్ల తరబడి ఆ రైతు సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూమిని పొక్లెయినర్లతో ధ్వంసం చేసి, పెంచుకున్న చెట్లను గంటల వ్యవధిలో నరికివేసి గుంజుకున్న తీరు చూస్తుంటే.. ప్రజాస్వామ్య రాష్ట్రంలోనే ఉన్నామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జబర్దస్తీ చేసి లాక్కున్న భూమిలో ఖాళీ బీరు సీసాలు కడిగే కంపెనీ పెట్టినట్టు ఈ తరహా భూ కేటాయింపులు అన్యాయం అని, కేటాయింపును రద్దు చేసి రైతుకు తిరిగి అప్పగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
గుట్టుగా జెట్టీ ఇన్ఫ్రాకు కేటాయింపు
గుంజుకున్న భూమిని కాంగ్రెస్ నేత కుటుంబానికి చెందిన ‘జెట్టి ఇన్ఫ్రా’కు 6 ఎకరాల భూమిని నామమాత్ర ధరకే కట్టబెట్టారని, గత డిసెంబర్లోనే భూ కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్టు టీజీఐఐసీ అధికారులు ఇస్తున్న వివరణ ద్వారా స్పష్టమవుతున్నది. కొత్లాపూర్‌లో జాతీయ రహదారికి, పరిశ్రమలకు అత్యంత సమీపంగా ఉన్న ఈ భూములకు ప్రస్తుతం మారెట్లో ఎకరాకు రూ.5 కోట్ల దాకా డిమాండ్ ఉన్నదని స్థానికులు చెప్తున్నారు. అలాంటి అత్యంత విలువైన 6 ఎకరాల స్థలాన్ని బీరు సీసాలు కడిగే కంపెనీకి అప్పగించినట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక అవసరాల కోసం భూకేటాయింపులు జరిపే సమయంలో టీజీఐఐసీ నిబంధనల ప్రకారం డీపీఆర్, పెట్టుబడి పరిమాణం, స్థానిక నిరుద్యోగులకు కల్పించే ఉద్యోగావకాశాలు, పర్యావరణ అనుమతులను క్షుణ్ణంగా మదింపు చేయడంతోపాటు పారదర్శకమైన ఈ-వేలం లేదా నోటిఫికేషన్ ద్వారా అర్హత ఉన్న సంస్థలను ఆహ్వానించాల్సి ఉంటుంది. భూమిపై హకుల వివాదాలు లేవని నిర్ధారించే టైటిల్ వెరిఫికేషన్, అసైన్డ్ భూముల మినహాయింపు తదితర నిబంధనలను ఏవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ అస్మదీయ సంస్థకు భూమి కేటాయించినట్టు సమాచారం.
అధికారుల లేఖతో మొదలై..
కొత్లాపూర్లోని సర్వే నెంబరు 294, 294/2లో ఉన్న 83 ఎకరాలకుపైగా భూమిని 2008లో పరిశ్రమల ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. సర్వే నెంబర్ 294లోని 67 భూమిని భూమిని ఓ బీరు పరిశ్రమకు కేటాయించింది. 67 ఎకరాల విస్తీర్ణంలో బీరు పరిశ్రమ నిర్మాణం జరిగింది.ప్రస్తుతం పరిశ్రమ కొనసాగుతున్నది. దీనికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 294/2లో 16.05 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. ఈ భూమిపై కన్నేసిన కాంగ్రెస్ జాతీయ నేత.. ఎలాగైనా దక్కించుకొనేందుకు టీజీఐఐసీ మాజీ చైర్మన్ భర్త ద్వారా 2025 నుంచే పావులు కదిపినట్టు సమాచారం. అయితే అసైన్డ్ పట్టాదారులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, టీజీఐసీసీ మాజీ చైర్మన్ భర్త అనుచరులు ఎకరాలకు రూ 20 లక్షల చొప్పున ఆశ చూపించి వారిని భూమిని బయటికి పంపే ప్రయత్నం చేశారు.
సాగు చేసుకుంటున్న భూమిని ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో అధికార బలాన్ని ప్రయోగించి వ్యవహారం చక్కదిద్దినట్టు బాధితులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిరుడు మే నెలలో టీజీఐఐసీ అధికారులు కొత్లాపూర్లోని తమ పరిధిలో ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆర్డీవో, తహసీల్దార్‌కు లేఖ రాసినట్టు తెలుస్తున్నది. స్థానిక కాంగ్రెస్ నాయకుని ఆదేశం మేరకే టీజీఐసీసీ ఈలేఖ రాసినట్టు, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి భూమిని స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఫిర్యాదు వస్తే కనీసం సర్వే చేసి నిర్ధారణ చేయటం రెవెన్యూ అధికారుల కనీస ధర్మం. కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకుండా సాగుదా రుడిని పక్కకు తప్పించే అధికారం పోలీసులకు లేదని గతంలోనే హైకోర్టు చెప్పింది. కానీ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇవేమీ పట్టించు కోకుండా రైతులను సాగుభూమి నుంచి లాగి పక్కకు ఈడ్చిపడేశారని, తమ అభ్యంతరాలు కూడా వినలేదని బాధితులు చెప్తున్నారు.
భూమిని తిరిగి అప్పగించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
భూ కేటాయింపుపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. ఆరు ఎకరాల భూమిని కాంగ్రెస్ నేతకు చెందిన జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్టు అక్రమంగా కేటాయించారని, దీనికి తోడుగా మరో 10 ఎకరాలు ఆక్రమించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో మూడు ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉన్నదని, అసైన్డ్ భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో దళిత రైతుల అసైన్డ్ భూములను దర్జాగా గుంజుకుంటున్నారని, ఇప్పటికి దాదాపు 1,100 ఎకరాలు తారుమారయ్యాయని ఆరోపించారు. మరోవైపు బాధిత రైతు కుటుంబాలు కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. కాగా, కొత్లాపూర్లోని ఆరెకరాలను జెట్టి ఇన్ఫ్రాకు కేటాయించింది వాస్తవమేనని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్ అంగీకరించారు. అయితే కేటాయింపు రాష్ట్రస్థాయిలోని ఉన్నతాధికారుల నిర్ణయమని చెప్పారు. కేటాయించిన తేదీ, ధర తదితర వివరాలను వెంటనే చెప్పలేనని పేర్కొన్నారు.
3.20 ఎకరాలను బలవంతంగా లాక్కున్నారు
వారసత్వంగా సాగు చేసుకుంటూ ఫలసాయం పొందవచ్చు అనే నిబంధనతోనే ప్రభుత్వం దళిత బహుజనులకు పట్టాలు ఇచ్చింది. ఇలాంటి భూములకు పూర్తిస్థాయి పట్టాలు ఇచ్చి యాజమాన్య హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత బహుజనుల భూముల మీద పడి వ్యాపారం చేస్తున్న ఘటనలు సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. జెట్టి ఇన్ఫ్రాకు కట్టబెట్టిన 6 ఎకరాల్లో 3.20 ఎకరాల్లో రాజ్ మహ్మద్ కుటుంబం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నది.
మహబూబ్ సాబ్ అనే వ్యక్తికి 1980 ప్రాంతంలో 3.20 ఎకరాలు అసైన్ చేసినట్టు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. మహబూబ్‌సాబ్ మరణం తర్వాత ఆయన భార్య మైబమ్మ, ఆమె మరణానంతరం మనవడు రాజ్ మహ్మద్ కుటుంబం సాగు చేసుకుంటూ వస్తున్నది. ఆ భూమిని కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా తమ వద్ద నుంచి గుంజుకున్నారని రాజ్ మహ్మద్ చెప్తున్నారు. అంతటితో ఆగకుండా జెట్టి సంస్థకు భూమిని కేటాయించిన తర్వాత దానికి దారి సమస్య ఉత్పన్నమైనట్టు చెప్తున్నారు. టీజీఐఐసీ మాజీ చైర్మన్ భర్త రెవెన్యూ, పోలీసులతో మరోసారి రంగ ప్రవేశం చేసి ఈసారి సర్వే నంబర్ 16లోని 2.10 ఎకరాల మామిడి తోటకు కూడా టీజీఐఐసీ ముసుగు తగిలించి తీసుకున్నట్టు తెలుస్తున్నది. అంతా కలిపి సదరు నేతకు అప్పగించించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

