హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : వందల, వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములను ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. నెల రోజులుగా ఆర్టీసీ యూనియన్లు, కార్మికులను గుర్తింపు సంఘం ఎన్నికల వైపు మళ్లించి, అడ్డదారిలో ఆర్టీసీ భూములను మాయం చేసేందుకు సిద్ధమైంది. కార్మికులు, నేతలు ఎన్నికల హడావుడిలో ఉండగానే.. ఆర్టీసీ భూముల అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం, ఆర్టీసీ యాజమాన్యానికి లేఖ రాయడం, ముషీరాబాద్ డిపో-1లోని ఆర్టీసీ క్వార్టర్స్ స్థలాన్ని తీసుకోవడం, దాన్ని నోటిఫై చేసినట్టు పత్రికలకు ప్రకటన ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ముషీరాబాద్ పరిధిలోని జమిస్తాన్‌పూర్‌లో ఇప్పటికే పాడుబడి ఉన్న ఆర్టీసీ కార్మికులకు చెందిన కార్వర్ట్స్‌ను పూర్తిగా కూలగొట్టి.. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ స్థలంలో 480 ప్లాట్లు నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. క్యాబినెట్లో స్థలవివాదంపై తీవ్రంగా చర్చించినట్టు తెలిసింది.
ప్రస్తుతం ఆ భూముల స్వాధీనంపై ఆర్టీసీ అనుమతి తీసుకున్నదా? లేదా? అనే విషయంపై స్పష్టత రాకుండానే హౌసింగ్ కార్పొరేషన్ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచన మేరకు జమిస్తాన్పూర్ ఆర్టీసీ క్వార్టర్స్‌ను నోటిఫై చేశారని సమాచారం. అయితే, ఆర్టీసీ భూముల స్వాధీనంపై న్యాయపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులను 9వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చారు. ఈ ఆస్తుల విభజన, యాజమాన్యానికి సంబంధించిన సమస్యలు పరిషారం కాలేదు. ఇటీవల బస్‌భవన్‌లో సగం తమకే చెందుతుందంటూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తాళాలు వేసుకొని మరీ వెళ్లారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బస్‌భవన్ సమీపంలోని ఆర్టీసీకి చెందిన చెందిన సుమారు 9.14 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ భూమిలోని 6.5 ఎకరాల స్థలాన్ని కొత్తగా కొనుగోలు చేసిన బస్సుల చాసిస్ల పారింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారు. ఈ స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ప్రతిపాదనపై ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకున్నదో స్పష్టత లేదు. ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించినట్టు చెప్తున్నా.. దానిపై వివరణ కోరగా ఈడీలు, ఉన్నతాధికారులెవరూ స్పందించలేదు. దానిపై దాటవేత ధోరణి ప్రదర్శించారు. జమిస్తాన్పూర్ ఆర్టీసీ క్వార్టర్స్‌తోపాటు బస్‌భవన్ పక్కన ఉన్న స్థలాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ఇచ్చిందనే ప్రచారం జోరందుకున్నది. 2017 లో ఈ 9.14 ఎకరాల భూమిలో కమర్షియల్‌గా అభివృద్ధి చేయాలని నాటి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అప్పుడే ఆ భూమి విలువ రూ.350 కోట్లుగా చూపారు. ఇప్పుడు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.