హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సక్రాంతి పండుగకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యమని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని కోరారు. టీఎస్ ఆర్టీసీకి సహకరించిన అధికారులను ప్రత్యేకంగా సన్మానించనున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బస్ భవన్లో పోలీస్, రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్ ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను నమ్మి ఇబ్బందులు పడొద్దని, ఆర్టీసీలో సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని తెలిపారు. www.tsrtconline.in వెబ్ సైట్లోకి వెళ్లి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.