హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : బీజేపీ దళిత మహిళా నేతకు పదవుల ఆశచూపి అదే పార్టీకి చెందిన బీజేవైఎం జాతీయ మాజీ కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ తీవ్ర వేధింపులకు గురిచేశారని, మూడుసార్లు బెడ్రూమ్కు రావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. బండి భగీరథ లైంగిక వేధింపుల కేసు మరువక ముందే మరో బీజేపీ నేత దుర్మార్గం బయటపడిందని పేర్కొన్నారు. స్వశక్తితో రాజకీయాల్లో పైకి రావాలని కోరుకుంటున్న దళిత మహిళను బెడ్రూమ్లోకి రావాలని వేధించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బాధితురాలు హైదరాబాద్ అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్ అధికారులు పట్టించుకోవడంలేదని, ఏదో నామ్కేవాస్తేగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి వదిలేశారని తెలిపారు. నిందితుడు సాయి ప్రసాద్‌ను అరెస్ట్ చేయకుండా ఇటు బీజేపీ పెద్దలు, అటు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యులు అండగా ఉంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మహిళా నేతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను వివరించారని తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేస్తున్న మహిళపై సాయిప్రసాద్ తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని చూడకుండా ఆమెకు సాయిప్రసాద్ పదవుల ఆశ చూపి ఏండ్లుగా పనిచేయించుకున్నాడని, చివరికి పదవులు ఇప్పించకుండానే మోసం చేసినట్టు ధ్వజమెత్తారు. సాయిప్రసాద్ మోసాన్ని గ్రహించిన బాధితురాలు ఆయన్ను ప్రశ్నించడం మొదలు పెట్టిందని తెలిపారు. తనకు పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరేందుకు అతని ఇంటికి ఆమె వెళ్లగా ‘నా బెడ్రూమ్కు రా’ అని వేధింపులకు గురిచేసినట్టు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. 2024 డిసెంబర్ 24న ఒకసారి, 2025 ఏప్రిల్1న రెండోసారి, 2025 ఆగస్టు 9న మూడోసారి ఇలాంటి ఘటనలే జరిగాయని తెలిపారు.
‘సార్.. దయచేసి అలా అనకండి’ అంటూ ఆ మహిళ వేడుకున్నా నిందితుడు సాయిప్రసాద్ వినిపించుకోలేదని, కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.అతని వేధింపులపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ కూడా తనను కులంపేరుతో దూషణలు ఎదురయ్యాయని పేర్కొన్నట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా ఏఐతో తన ఫొటోలను మార్పింగ్ చేసి వైరల్చేస్తానని బెదిరించాడని బాధిత మహిళ చెప్పినట్టు తెలిపారు. టీమ్ సాయి పేరుతో అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధించాడని ఆరోపించారు. పాక శివ, రాహుల్,జాన్, ఆదిత్య పేర్లతో ఫోన్లు చేసి తరచూ వేధింపులకు పాల్పడినట్టు చెప్పారు. తన వద్ద పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉన్నదని, ఢిల్లీ నుంచి ఈడీ నుంచి తెచ్చుకున్నానని, నీ ఫోన్ హ్యాక్ చేశానని సాయిప్రసాద్ ఆ బాధితురాలిని బెదిరించినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధిత దళిత మహిళకు న్యాయం చేయాల్సింది పోయి దుర్మార్గులకు వంత పాడుతున్నారని ఆరోపించారు.
రెండేండ్లుగా సాయిప్రసాద్ వేధింపులు, దుర్మార్గాలను భరించలేక ఈ నెల 5న మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులైన ఫహీం, శ్రీరాంకర్రి కలిసి పోలీసులను బెదిరించారని, నామ్కేవాస్తే ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారని తెలిపారు. బండి భగీరథ్ కేసు విషయంలో పేట్‌బషీరాబాద్ కేసులో చార్జీషీట్ ఎలా దాఖలు చేయలేదో ఈ కేసులోనూ అలాగే అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై మీడియాలోనూ వార్తలు రాకుండా చేశారని ఆరోపించారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటా ఉన్నదని బాధితురాలు చెప్తున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ మ్యానువల్ నడువడం లేదని, అనుముల రేవంత్‌రెడ్డి మ్యానువల్ నడుస్తున్నదని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి చెప్తేనే ఎఫ్ఐఆర్ అవుతుందని, ఆయనతోనే అకనాలెడ్జ్మెంట్ ఇస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని, నేర స్థలాన్ని పరిశీలిస్తున్నారని, చార్జ్‌షీట్ ఫైల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి చెప్పకపోతే పోలీసులు ఎఫ్ఐఆర్ పక్కన పడేస్తారని, పట్టించుకోరని ఆరోపించారు. వీరి అండ చూసుకొని నిందితుడు న్యాయస్థానాలకు వెళ్లి బెయిల్ తెచ్చుకొని బాజాప్తా తిరుగుతాడని, లేదంటే నిందితుడికి స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. సాయిప్రసాద్‌పై వివిధ చోట్ల 14 కేసులు ఉన్నాయని, ఆయన పక్కా రౌడీషీటర్ అని ఆరోపించారు. సాయి ప్రసాద్‌కు బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ ముఖ్యులతో సంబంధాలున్నాయని తెలిపారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా, విదేశాంగశాఖ మంత్రి జయశంకర్, బీజేపీ జనరల్ సెక్రటరీ బన్సల్, చినజీయర్ స్వామి, చిరంజీవి, రామ్‌చరణ్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో సాయిప్రసాద్ తీసుకున్న ఫొటోలను ఆర్ఎస్పీ మీడియాకు చూపించారు. అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నారని పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు.
సాయి ప్రసాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డితోనూ సంబంధాలున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సాయిప్రసాద్ పెండ్లికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అతని ఇంటికే వెళ్లారని తెలిపారు. రౌడీషీటర్, బీజేపీ నేతతో సీఎంకు ఉన్న సంబంధమేందని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తానాకు ఇదే నిదర్శనమని, అందుకే ఇప్పుడు సాయిప్రసాద్‌ను కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బాధితురాలికి జరిగిన అన్యాయంపై వెంటనే ప్రభుత్వం సిట్ వేయాలని, లేదంటే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బాధిత మహిళకు తగిన న్యాయం చేయాలని మల్కాజిగిరి కమిషనర్ సుమతి, డీజీ ఉమెన్ సేఫ్టీ చారుసిన్హాను ఆయన కోరారు. ఇప్పటివరకు పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయలేదని చెప్పారు. పేట్‌బషీరాబాద్ కేసు చేసినట్టే దీన్ని కూడా చేద్దామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ మహిళా నేతలు డీకే అరుణ, మాధవీలత, రాణి రుద్రమదేవితోపాటు ఇతర బీజేపీ మహిళా నేతలు ఈ వేధింపులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలైన లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రాంచందర్ తదితరులంతా స్పందించాలని డిమాండ్ చేశారు.