శనివారం 29 ఫిబ్రవరి 2020
పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం

పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం

Feb 15, 2020 , 02:12:51
PRINT
పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం
  • సోషల్‌ మీడియాలో తుపాకీ కాల్పుల వీడియో వైరల్‌
  • జనవరి ఒకటిన పేల్చిన సీఆర్పీఎఫ్‌ మాజీ జవాన్‌
  • అరెస్టు చేసిన పోలీసులు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సాయంపేట తుపాకీ కాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్‌ మాజీ జవాన్‌ బద్దం తిరుమల్‌రెడ్డి(40)తోపాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జోన్‌ డీసీపీ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటకు చెందిన బద్దం తిరుమల్‌రెడ్డి 2002 నుంచి 2019 మే వరకు సీఆర్పీఎఫ్‌లో పనిచేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత డీబీబీఎల్‌ లైసెన్స్‌డ్‌ వెపన్‌, 20 బుల్లెట్లు తీసుకున్నాడు. గత జనవరి ఒకటిన రాత్రి స్నేహితులు, సన్నిహితుల ప్రోత్సాహంతో గ్రామంలో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీన్ని కొంతమంది సెల్‌ఫోన్‌లో వీడియోతీశారు. ఈ క్రమం లో గురువారం రాత్రి గ్రా మంలో జరిగిన ఓ వివాహ వేడుకలో తిరుమల్‌రెడ్డికి మరికొందరికి మధ్య గొడవ జరిగింది.


తిరుమల్‌రెడ్డితో గొడవపడ్డ వారు ఆయన గతంలో జరిపిన కాల్పుల వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేయగా వైరల్‌ అయింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం తో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. తిరుమల్‌రెడ్డి బహిరంగంగా కాల్పులు జరిపిన విషయాన్ని ధ్రువీకరించి శుక్రవారం అతడి వద్ద నుంచి వెపన్‌తోపాటు ఆరు బులెట్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్‌ చేశారు. కాల్పులకు ప్రోత్సహించిన బద్దం కార్త్తీక్‌రెడ్డి, బొల్లం శ్రీనివాస్‌, బొడిగె శ్రీకాంత్‌, కూకట్ల వెంకటేశ్‌, బద్దం లక్‌పతిరెడ్డి, నేరెళ్ల రాకేశ్‌ను కూడా అరెస్టు చేసినట్టు డీసీపీ వెల్లడించారు.


logo