హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీడీసీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సంగి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ విజయ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా, అసోసియేట్ అధ్యక్షుడిగా కే శ్రీనివాసరాజు, అసోసియేట్ సెక్రటరీగా ఏ అశోక్‌ను నియమించారు. ఇక ఉపాధ్యక్షులుగా జీ సుకన్య, వై చిన్నప్పయ్య, జాయింట్ సెక్రటరీగా జీ శ్రీనివాస్, వీ విజయలక్ష్మి, ఆర్థిక కార్యదర్శిగా కే ప్రభు, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పీవీ గీతాలక్ష్మీపట్నాయక్, అకడమిక్ సెక్రటరీగా ఎం నవీన్, కార్యనిర్వాహక మండలి సభ్యులుగా కే ప్రవీణ్‌కుమార్, జీ పోచయ్య, ఎం సుధాకర్, ఆర్ రవినాయక్‌ను ఎన్నుకున్నారు.
సర్కారు బడుల్లో ఏఐ పాఠాలు ; 1- 5 తరగతుల కోసం విద్యాశాఖ సన్నాహాలు
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత పాఠాలను బోధించాలని విద్యాశాఖ భావిస్తున్నది. పాఠాల బోధనలో ఏఐని వినియోగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా 1-5 తరగతుల్లోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పాఠాలు చెప్పాలని యోచిస్తున్నది. ఇటీవలే విద్యాశాఖ సెక్రటరీగా నియమితులైన డాక్టర్ యోగితారాణా విభాగాలవారీగా సమీక్షిస్తున్నారు. సోమవారం ఇంటర్ విద్య, సమగ్రశిక్ష అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత బోధనపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఏఐ పాఠాల బోధనకు ఓ ప్రైవేట్ సంస్థ సహాకారాన్ని తీసుకోనున్నారు. విద్యార్థి సామర్థ్యాలను, నైపుణ్యాలను బేరీజువేసి ఒక్కొక్కరి బలాబలాలను గుర్తించేందుకు ఏఐని విస్తృతంగా వాడుతున్నారు. దీని ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వీలుంటుంది.