కొండమల్లేపల్లి, ఆగస్టు 23: రాష్ట్రంలోని అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న మన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నదని, కానీ.. ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర అభివృద్ధి పట్ల అక్కసుతో మాట్లాడారన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ కానీ, అమిత్షా కానీ సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.