Sun Halo | బొల్లారం: సాధారణంగా ఆకాశంలో ఏదో ఒక మూలన అర్ధ చంద్రాకారంలో ఇంద్రధనస్సులు ఏర్పడి కనువిందు చేస్తాయి. కానీ.. మంగళవారం ఉదయం సరిగ్గా 11 గంటల సమయంలో సూర్యుడిని వలయాకారంలో బంధించినట్టుగా సప్తవర్ణశోభితమైన హరివిల్లు ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాన్ని సంగారెడ్డి జిల్లా బొల్లారం ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి గణితశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యం తన సెల్ఫోన్లో బంధించారు.
దీన్ని ఖగోళ పరిభాషలో ‘సన్హలో’గా (Sun Halo) పిలుస్తారని, వాతావరణంలో ఉండే లక్షలాది షడ్భుజాకారపు మంచు స్పటికాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెంది ఈ వలయాలు ఏర్పడుతాయని సదరు ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. ఈ చిత్రాలు, వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. –