హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు ఉపాధి చూపాలని గురువారం పలువురు కళాకారులు రవీంద్రభారతి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్కడే ఒక సాంసృతిక కార్యక్రమానికి హాజరైన మంత్రిని స్థానిక కళాకారులు కలిసి తమ సమస్యలను పరిషరించాలని కోరారు. సమస్యలు విన్నవించుకొనేందుకు మంత్రి కాళ్లపై పడి వేడుకున్నా ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ సాంసృతికరంగానికి జీవం పోస్తున్న కళాకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని, సమస్యలు వినే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందిం చి కళాకారులకు న్యాయం చేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మంత్రి స్పందించకపోవడంతో కళాకారులు ఆయన కాన్వాయ్కి అడ్డుగా నిలబడటంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కళాకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కళాకారులుగా గొంతు విప్పి పోరాడాం. మాకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సాంసృతిక సారథిలో అర్హులైన ఉద్యమ కళాకారులకు ప్రభుత్వం 1,000 ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి. కళాకారుల సంక్షేమం, పెన్షన్లు, గౌరవ వేతనాలు, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని గొప్పగా చెప్పారు. మేము శాంతియుతంగా ధర్నా చేశాం. మంత్రి జూపల్లి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చాలామంది గాయపడ్డారు. పుస్తెలతాడు తెగి ఎకడో పోయింది.
– మట్టెవాడ కవిత, తెలంగాణ ఉద్యమ కళాకారుల కమిటీ ఉపాధ్యక్షురాలు
ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన అనేకమంది నిరుద్యోగ కళాకారులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలు, పింఛన్లు అందించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. తమ న్యాయమైన హకుల కోసం రవీంద్రభారతి, గన్పార్ ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న కళాకారులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం తగదు. కళాకారుల డిమాండ్లు నెరవేర్చేదాకా వరకు మా పోరాటం ఆగదు.
– గజవెల్లి ప్రతాప్, తెలంగాణ ఉద్యమ/నిరుద్యోగ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి